యంగ్ హీరో నారా రోహిత్, సీనియర్ నటుడు జగపతిబాబు ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి 'ఆటగాళ్ళు' అనే వెరైటీ టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఈ రోజే లాంఛనంగా ప్రారంభమయ్యింది. పరుచూరి మురళి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. వెరైటీ కథల్ని ఎంచుకోవడంలో నారా రోహిత్ దిట్ట. సినిమా సినిమాకీ కథల ఎంపికలో ఎంతో జాగ్రత్త తీసుకుంటుంటాడీ యంగ్ హీరో. అలాగే విలక్షణమైన పాత్రలు ఈ మధ్య జగపతిబాబు కోసం కొత్తగా పుట్టుకొస్తున్నాయి. అలా ఈ సినిమా కోసం ఇద్దరికీ విభిన్నమైన పాత్రలు సెట్ అయ్యాయట. ఇంతకీ ఈ ఇద్దరు 'ఆటగాళ్ళు' తెరపై ఏం చేయబోతున్నారంటే, అది ప్రస్తుతానికి సస్పెన్సేనట. నెగెటివ్ రోల్స్‌లోనే కాక, తండ్రి పాత్రల్లోనూ జగపతిబాబు తనదైన విలక్షణత ప్రదర్శిస్తున్నారు. లేటు వయసులోనూ హీరోయిజం చూపించే పాత్రలతో సత్తా చాటడం జగపతిబాబుకే చెల్లింది. మొన్నీమధ్యనే 'పటేల్ సర్' సినిమాలో జగపతిబాబు ఫిజిక్‌ని చూసి ఆశ్చర్యపోయారంతా. సినిమా ఫలితమెలా వున్నా, ఆ సినిమాలో జగపతి స్టయిలింగ్ అందరికీ బాగా నచ్చేసింది. తెలుగులోనే కాకుండా, ఇతర భాషల్లోనూ జగపతి జోరు కొనసాగుతోంది. 'ఆటగాళ్లు' విషయానికొస్తే, ముందే చెప్పుకున్నట్లు ఇదొక డిఫరెంట్ మూవీ అట. 'ఆటగాళ్లు' అనే టైటిల్‌ని ఫిక్స్ చేయడం వెనుక పెద్ద కథే వుందట. అదేంటో, తెరపైనే చూడాలంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.