రాజుగారి రెండో పెళ్లాం బాగుంది అని చెప్పడానికి, మొదటి పెళ్లాన్ని అంధవికారిని చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం కొంతమంది విమర్శకులు చేస్తున్న పని అదే. ఇటీవల `జై భీమ్` విడుదలైంది. నిస్సందేహంగా అది మంచి సినిమా. ఎవరూ కాదనలేరు. ఓ రకంగా.. తమిళ గౌరవాన్ని పెంచిన సినిమా. సూర్య అద్భుతంగా చేశాడు. బలమైన కథ, కథనాలు, క్యారెక్టరైజేషన్స్ తో సాగినసినిమా అది. కచ్చితంగా ఈసారి బోలెడన్ని అవార్డులు కొట్టుకుపోతుంది.
అయితే `జై భీమ్`ని పొగిడే పనిలో భాగంగా `వకీల్ సాబ్`ని టార్గెట్ చేస్తున్నారు కొంతమంది. అదో చెత్త సినిమా అని, సూర్యని చూసి పవన్ బుద్ధి తెచ్చుకోవాలని.. అర్థం పర్థం లేని పోలికలతో.. ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నారు. `వకీల్ సాబ్` విడుదలైనప్పుడు మంచి రేటింగులు ఇచ్చిన ఓ వెబ్ సైట్ సైతం... `వకీల్ సాబ్ అసలు సినిమానే కాదు...` అన్నట్టు రివర్స్ గేర్‌లో వెళ్లి మాట్లాడుతోంది. జై భీమ్ విడుదలయ్యాక... టాలీవుడ్ లో వచ్చిన సినిమాల్ని తవ్వి మరీ... రివ్యూ ఇస్తున్నారంటే.. వీళ్ల పైచాచిక ఆనందం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
జై భీమ్ లో సూర్య అస్సలు కమర్షియల్ విలువలు - గోల పట్టించుకోలేదు. నిజమే. కానీ దానికీ... `వకీల్ సాబ్`లో పవన్ చేసిన, ఫైట్లకీ, పాటలకూ లింకేంటి? జై భీమ్ కథకీ, వకీల్ సాబ్ కథకీ అస్సలు సంబంధమే లేదు. ఆమటకొస్తే.. సూర్య ఇమేజ్ వేరు, పవన్ ఇమేజ్ వేరు. రెండింటికీ లింకు పెడతానంటే ఎలా? సినిమాల గౌరవం పెంచడానికి ఎవరూ.. పనిగట్టుకుని సినిమాలుతీయరు. సినిమా అనేది ఓ ప్రోసెస్. పెట్టుబడి - రాబడి అనే గీతల మధ్యే సినిమా మొదలవుతుంది. జై భీమ్ తీసి సూర్య ఏం నష్టపోలేదు. ఈ సినిమాతో సూర్య లాభాలు గడించాడు. కాకపోతే.. ఓ మంచి సినిమా చేశాడన్నతృప్తి అదనంగా మిగిలిదంతే. సూర్య వర్జినల్ సినిమా చేశాడని, పవన్ రీమేకులు నమ్ముకుంటున్నాడని, కమర్షియల్ సినిమాలు చేస్తాడని - చేస్తున్న విమర్శల్లోనూ అర్థం లేదు.
సూర్య ఇప్పటి వరకూ కమర్షియల్ సినిమాలు చేయలేదన్నట్టుగా ఉంది వాళ్ల వాదన. `సింగం` సిరీస్ ని ఒక్క సారి చూస్తే.. సోకాల్డ్ సినీ మేధావులు తలలు పట్టుకుంటారు. కమర్షియాలిటీకి కేరాఫ్ అడ్రస్స్ లా ఉంటాయని ఆ సినిమాలు. తమిళ ప్రేక్షకులు వాటినీ ఆదరించారు. జై భీమ్ నీ చూశారు. వాళ్ల టేస్ట్ అది. మన టేస్ట్ ఇది. కాబట్టి.. ఇక్కడ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేయాల్సిందే.
తమిళ సినిమాలు చూసి నేర్చుకోండి అని ఇంకొంతమంది గొంతు పెంచుతున్నారు. అదే తమిళంలో మొన్ననే.. `పెద్దన్న`అనే సినిమా వచ్చింది. మరి.. దానికీ, జై భీమ్ కి ఎంత తేడా వుంది? దాన్ని పట్టించుకోరే..? తమిళంలో వచ్చినవన్నీ గొప్ప సినిమాలు కావు. తెలుగులో వస్తున్నవి చెత్త సినిమాలూ కావు. ఈ విషయాన్ని విమర్శకులు గుర్తెరగాలి.