రజనీకాంత్ సినిమా అంటే.. ఓ రేంజ్. ఎవరికీ సాధ్యం కాని అద్భుతాల్ని... రజనీ సినిమాలు చేసి చూపించేవి. రజనీ సినిమా తమిళ నాటే కాదు.. దేశ వ్యాప్తంగానూ రికార్డు వసూళ్లు కొల్లగొట్టేవి. తెలుగులో అయితే.. ఇక్కడి సూపర్ హీరోల సినిమాల వసూళ్లని తలదన్నేలా కలక్షన్లు దక్కించుకునేవి. రజనీ నుంచి వచ్చిన డబ్బింగ్ సినిమాలకు వసూళ్ల మోత మోగిపోయేది. అలా.... రజనీ టాలీవుడ్ లోనూ ప్రభంజనాలు సృష్టించాడు. అయితే... ఆ ఊపు, హైపు ఇప్పుడు కనిపించడం లేదు.
ఇటీవల విడుదలైన రజనీ సినిమా `పెద్దన్న` వసూళ్లే ఇందుకు సాక్ష్యం. ఈ సినిమాని తెలుగులో రూ.12 కోట్లకు కొన్నారు. 12 కోట్లు ఓ డబ్బింగ్ సినిమాకు పెట్టడం ఎక్కువే కానీ, రజనీ సినిమాకాబట్టి.. అది రీజన్‌బుల్ రేటే. రోబో, శివాజీ లాంటి సినిమాలు తెలుగులో వసూళ్ల వర్షం కురిపించుకున్నాయి. అప్పటి టికెట్ రేట్లతో పోలిస్తే... రజనీ సినిమాకి ఇప్పుడు 12 కోట్లు చెల్లించడం చాలా తక్కువ.
అయితే.. ఈ సినిమాకి ఇప్పటి వరకూ 4 కోట్లే తిరిగి వచ్చాయట. అంటే.. ఏకంగా 8 కోట్ల లాస్. రజనీ సినిమా వల్ల తెలుగులో నిర్మాతలు నష్టపోవడం ఇదే తొలిసారి కాదు. గత కొన్నేళ్లుగా ఇలానే జరుగుతోంది. కబాలి, కాలా, రోబో 2.ఓ చిత్రాల వల్ల తెలుగు నిర్మాతలకు ఒరిగిందేం లేదు. ఇప్పుడు పెద్దన్న రిజల్ట్ కూడా అలానే తయారైంది. ఇక మీదట రజనీకాంత్ సినిమాలంటే.. ఎగసి కొనేసుకునే రోజులు ఉండకపోవొచ్చు.