అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెరంగేట్రంపై అంతా ఆశక్తిగా ఎదురు చూశారు. ఆమె విజయం ఎలా ఉంటుందోనని ఉత్కంఠ ప్రదర్శించారు. ఎట్టకేలకు జాన్వీ తానేంటో నిరూపించుకుంది. తొలి సినిమాతోనే తడాఖా చూపించింది.
జాన్వీ నటించిన 'ధడక్' చిత్రం 10 రోజుల్లో 63 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఆ తల్లి కూతురుగా జాన్వీ తన స్టామినా నిరూపించుకుంది. అలాగే నటన పరంగానూ ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేకుండా, విమర్శకుల నుండి ప్రశంసలు దక్కించుకుంది. అందుకే ప్రఖ్యాత వోగ్ మ్యాగజైన్ ప్రతీ ఏడాది ఇచ్చే ఫ్రెష్ ఫేస్ అవార్డును ఈ ఏడాది జాన్వీకి అందించింది. ఈ అవార్డు అందుకున్న జాన్వీ కపూర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
తల్లి లేదన్న తీరని లోటు, చిన్న వయసులోనే తగలకూడని గాయం మనసుకు తగిలినా, హీరోయిన్‌గా తాను ఎంచుకున్న లక్ష్యంలో మొదటి విజయం సాధించినందుకు ఆమె మనసులోని గాయానికి కూసింత ఊరట లభించినట్లేనని చెప్పాలి. తొలి సినిమా విజయం జాన్వీలో ఆత్మ విశ్వాసాన్ని పెంపు చేసింది. తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో ధైర్యంగా ముందుకు సాగేలా తనను తాను బిల్డప్ చేసుకునేలా చేసింది. జాన్వీ తదుపరి చిత్రం తండ్రి బోనీకపూర్ నిర్మాణంలో ఉండబోతోందని జాన్వీ స్పష్టం చేసింది.
కేవలం బాలీవుడ్‌లోనే ఉండిపోకుండా, బాలీవుడ్‌తో పాటు, టాలీవుడ్‌లో కూడా సినిమాలు చేయాలని శ్రీదేవి అభిమానులు ఆశిస్తున్నారు. తల్లిని ఆదరించినట్లే, జాన్వీని కూడా ఆదరించేందుకు తెలుగు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. చూడాలి మరి, జాన్వీ ఎంపిక ఎలా ఉంటుందో.