శ్రీదేవి హఠాన్మరణంతో కూతురు జాన్వీ కపూర్ బాధ వర్ణనాతీతం అని చెప్పాలి. ఆ బాధను తన మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేస్తూ, జాన్వీ, తల్లి శ్రీదేవికి ఓ లెటర్‌ను రాసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. శ్రీదేవి ఉన్నన్నాళ్లు కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌కీ ఎలాంటి కష్టం తెలియకుండా పెంచింది.
కానీ శ్రీదేవి ఇప్పుడు లేదు. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. మరి కూతుళ్ల పరిస్థితేంటి? అదే వారి ప్రత్యక్ష బాధ. ప్రత్యక్షంగా ఆ లోటు వారి జీవితాల్లో ఉన్నా సరే, ఇంతవరకూ తన తల్లి నేర్పిన క్రమశిక్షణ, మనోధైర్యంతో ఇకపై తమ జీవితాన్ని కొనసాగించాలనీ, తల్లి లేకున్నా, ఆమె జ్ఞాపకాలు, నేర్పిన మంచి బుద్దులూ తమతో ఎప్పటికీ ఉంటాయనీ, అవే తమకు భవిష్యత్తులో దిశా నిర్ధేశం చేస్తాయనీ, శ్రీదేవి కూతుళ్లుగా తమను ఏ స్థాయిలో చూడాలని శ్రీదేవి కోరుకుందో ఆ కోరికను తీర్చే దిశగా తమ భవిష్యత్తును తీర్చి దిద్దుకుంటామన్నట్లు అర్ధం వచ్చేట్లుగా జాన్వీ లెటర్‌లో పేర్కొంది.
'నువ్వు మా జీవితంలో భాగం, నీ జీవితాన్ని మొత్తం మాకోసం ఇచ్చేశావు. ఇప్పుడు నీ కోసం నేనూ అదే చేయాలనుకుంటున్నాను. నిన్ను చూసి నేనెంత గర్వపడ్డానో, అలాగే నువ్వు ఏ లోకంలో ఉన్నా, అక్కడి నుండి నన్ను చూసి గర్వపడేలా నేను చేస్తాను. ప్రతీరోజూ అదే ఆలోచనతో నిద్ర లేస్తాననీ ప్రతిజ్ఞ చేస్తున్నా.. నువ్వు నాలో, ఖుషీలో, నాన్నలో ఎప్పటికీ నిండి ఉంటావు..' అంటూ 'ఐ లవ్ యూ మై ఎవ్రీథింగ్' అని బాధా తప్త హృదయంతో జాన్వీకపూర్ రాసిన ఈ లెటర్ అందర్నీ టచ్ చేసింది.
జాన్వీకపూర్ హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తోన్న 'ధడక్' సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. హీరోయిన్‌గా తన కూతురి గ్రాండ్ లాంఛింగ్‌ని కళ్లారా చూడకుండానే శ్రీదేవి అనంత లోకాలకు వెళ్లిపోయింది. శ్రీదేవి కోరిక తీర్చేలా జాన్వీకపూర్ వెండితెరపై హీరోయిన్‌గా ఎలా ఆకట్టుకుంటుందో, అభిమానుల నుండి ఎలాంటి ఆదరణ పొందుతుందో ఇకపై చూడాలి మరి.