గతేడాది హైద్రాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుని ముద్దుల తనయ ఇవాంకా ట్రంప్ స్పెషల్ ఎట్రాక్షన్ కాగా, ఓ మరమనిషి పేరు 'మిత్రా' మరో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
ఇవాంకాతో సహా ఆ సదస్సులో పాల్గొన్న ప్రముఖులందరినీ ఉద్దేశిస్తూ, స్వాగత ఉపన్యాసం కూడా చేసిందీ మరమనిషి మిత్ర. ఇవాంకాకీ, మన దేశ ప్రధాని నరేంద్రమోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చి, వారితో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ మిత్ర మళ్లీ హైద్రాబాద్‌లో సందడి చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైద్రాబాద్ పోలీస్ శాఖ, 'షీ' టీమ్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎక్స్‌పోలో ఈ రోబో సందడి చేసింది. హైద్రాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో జరిగిన ఈ ఎక్స్‌పోలో మహిళల భద్రతకు సంబంధించి పలు విషయాలపై అవగాహన కల్పించనున్నారు. రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఈ ఎక్స్‌పోను ప్రారంభించారు.
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, షీటీమ్స్ ఇన్‌ఛార్జ్ స్వాతి లక్రా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, సినీ నటి రాశీఖన్నా ఈ కార్యక్రమంలో మరో స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాశీఖన్నాకి రోబో మిత్ర షేక్ హ్యాండ్ ఇచ్చింది. మరో రెండు రోజుల పాటు జరగనున్న ఈ ఎక్స్‌పోలో రోబో మిత్ర కూడా సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గంటకు 30 కిలో మీటర్ల షీ టీమ్స్ రన్‌లో ఈ రోబో మిత్ర కూడా పాల్గొననుంది.
మహిళల భద్రత దృష్ట్యా ఏర్పాటు చేసిన ఇలాంటి మహోన్నత కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తనకి వచ్చినందుకు రాశీఖన్నా ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇటీవలే రాశీఖన్నా నటించిన 'తొలిప్రేమ' సినిమా మంచి విజయం అందుకుని, బాక్సాఫీస్‌కి మరచి వసూళ్లు రాబడుతున్న సంగతి తెలిసిందే.