అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్. మొదటి సినిమా 'ధడక్' యావరేజ్ మార్కులు తెచ్చుకున్న జాన్వికి ఆ సినిమా తర్వాత రెండు మూడు ఆఫర్లు వెంటనే వచ్చాయి. కరణ్ జోహార్ బ్యాకప్ ఉండడంతో కెరీర్ కు ఎదురు లేదని ఎక్కువ మంది భావించారు. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే మాత్రం అంత గొప్పగా ఏమీలేదు.
ఎందుకంటే జాన్వి నటించిన రెండు కొత్త సినిమాలు 'గుంజన్ సక్సేనా', 'రూహి ఆఫ్జానా' ఓటీటీ బాట పడుతున్నాయి. నిజానికి ఈ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయి ఉంటే జాన్వి క్రేజ్ వేరేగా ఉండేది. కానీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతూ ఉండడంతో అటు జాన్వికపూర్, ఇటు తండ్రిగారు బోనీకపూర్ ఇద్దరూ నిరాశ పడుతున్నారట. ఒకవైపు అలియా భట్ లాంటి వాళ్ళు భారీ ప్రాజెక్టులు సైన్ చేస్తూ కెరీర్లో దూసుకుపోతుంటే జాన్వి సినిమాలు ఇలా ఓటీటీలకు పరిమితం అవుతున్నాయని బాధపడుతున్నారట. నిజానికి జాన్వీ కి టాలీవుడ్ నుంచి గతంలో మంచి ఆఫర్లు వచ్చాయి. రెండు మూడు భారీ ప్రాజెక్టులలో హీరోయిన్ గా అవకాశం ఇస్తే బిజీగా ఉన్నానంటూ వాటిని రిజెక్ట్ చేసింది. ఇప్పుడు సరిగ్గా అదే విషయంలో జాన్వి బోనీకపూర్ బాధపడుతున్నారట.
ఇకపై బాలీవుడ్ ను మాత్రమే నమ్ముకోకూడదని, టాలీవుడ్ నుంచి ఏదైనా మంచి ఆఫర్ వస్తే తప్పనిసరిగా ఓకే చేయాలని నిర్ణయించుకున్నారట. నిజానికి ఈ ఆలోచన ముందే ఉంటే విజయ్ దేవరకొండ 'ఫైటర్' లాంటి ఒకటి రెండు సినిమాలు చేసి ఉండేది. ఏదేమైనా శ్రీదేవి కూతురు టాలీవుడ్ బాట పట్టడం అభిమానులకు సంతోషాన్నిస్తోంది.