కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు కదా..? ఓ చిన్న సినిమా అదే చేసింది. 5 కోట్లలోపు పూర్తయిపోయిన ఆసినిమా.. ఇప్పుడు 40 కోట్ల టార్గెట్ వైపుగా దూసుకుపోతోంది. అంటే.. రూపాయికి ఎనిమిది రూపాయల లాభం అన్నమాట. ఆ సినిమానే... `జాతిరత్నాలు`. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కథానాయకులుగా నటించిన చిత్రమిది. అనుదీప్ దర్శకుడు. నాగ అశ్విన్ నిర్మాత. గత గురువారం విడుదలైంది. తొలి రోజే సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. తొలి వారాంతంలో 20 కోట్లు వసూలు చేసింది. సోమవారం కూడా వసూళ్లు ఆశాజనకంగానే ఉన్నాయి.
ఫైనల్ రన్‌లోగా ఈ సినిమా మరో 20 కోట్లు వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విడుదలకు ముందే ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ సంపాదించుకుంది. శాటిలైట్, ఓటీటీ హక్కుల రూపంలో పెట్టుబడి వచ్చేసింది. ఇదంతా లాభమే అన్నమాట. బయ్యర్లు ఎప్పుడో బ్రేక్ ఈవెన్ తెచ్చేసుకున్నారు. సోమవారం నుంచి వచ్చిన ప్రతీ పైసా లాభమే. ఈమధ్య కాలంలో.. ఓ చిన్న సినిమా.. ఈ స్థాయిలో వసూళ్లు సంపాదించలేదు. చిన్న సినిమాలన్నింటికీ జాతి రత్నాలు ఓ ప్రేరణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.