యువ హీరోలు చాలామంది ప్రతినాయక పాత్రలపై మనసు పారేసుకున్నారు. `విలన్ గా చేయాలనివుంది` అని చాలాసార్లు తమమనసులోని మాటని బయటపెడుతూ ఉంటారు. అయితే ఆ అవకాశం చాలా అరుదుగానే వస్తుంటుంది. `గ్యాంగ్ లీడర్`లో ఆ ఛాన్స్ అందుకున్నాడు కార్తికేయ. ఆ సినిమాలో కార్తికేయ బాగానే నటించినప్పటికీ - సినిమా హిట్టు కాలేదు. ఓరకంగా.. ఆ సినిమా కార్తికేయకు మైనస్ గా మారింది. అయినా సరే, ప్రతినాయకుడి పాత్రలపై తనకు మమకారం పోలేదు. ఆ తరహా పాత్రలు ఇంకా చేయాలని ఉంది అంటున్నాడు కార్తికేయ.
``నాకు విలన్ పాత్రలంటే ఇష్టం. ప్రతినాయకుడిగా నటిస్తే.. మనలో సత్తా బయట పడుతుంది. విజయ్ సేతుపతి, సుదీప్ అలా తమలోని విభిన్నమైన కోణాల్ని చూపించిన వాళ్లే. ఆ తరహా పాత్రలు వస్తే నేను చేయడానికి సిద్ధమే. ప్రస్తుతం అజిత్ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నా. ఈ సినిమా విడుదలయ్యాక నన్ను చూసే కోణం మారుతుంది`` అంటున్నాడు కార్తికేయ. తను కథానాయకుడిగా నటించిన `చావు కబురు చల్లగా` ఈవారమే విడుదల కాబోతోంది.