ఈ యేడాది టాలీవుడ్ చూసిన అతి పెద్ద విజయం... `జాతి రత్నాలు`. కేవలం 4 కోట్ల బడ్జెట్ తో పూర్తయిన సినిమా ఇది. మొత్తంగా చూస్తే.. 70 కోట్ల వరకూ బిజినెస్ చేసింది. ఇంతకంటే పెద్ద హిట్టు ఏముంటుంది? ఇప్పుడు ఈ సినిమా బుల్లి తెరపై కూడా సంచలనం సృష్టించింది. ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకుంది.
తొలిసారి ఈ సినిమాని జెమినీలో టెలికాస్ట్ చేస్తే ఏకంగా 10.5 రేటింగ్ వచ్చింది. ఓ చిన్న సినిమాకు ఈ స్థాయిలో రేటింగ్ రావడం ఓ రికార్డే. నిజానికి ఈ సినిమాని థియేటర్లలో చాలామంది చూసేశారు. ఓటీటీలోనూ ఈ సినిమా విడుదలైపోయింది. టీవీలో రేటింగులు అంతగా ఉండవు అనుకున్నారంతా. కానీ.. అనూహ్యంగా 10.5 రేటింగ్ రావడం చర్చనీయాంశమైంది. మరోవైపు... ఎన్టీఆర్ `మీలో ఎవరు కోటీశ్వరులు` కార్యక్రమానికీ రికార్డు రేటింగులు వచ్చాయి. ఈ షో 11.5 రేటింగ్ సొంతం చేసుకుంది. అటు జాతిరత్నాలు, ఇటు ఎన్టీఆర్ షోతో.. జెమినీ రేటింగులలో ముందుకెళ్లిపోయింది.