తెలుగు సినిమాల్లో అరివీర భయంకరమైన ఫ్యాక్షనిస్టుగా భయపెట్టిన నటుడు జయప్రకాష్ రెడ్డి. ఆ తరవాత హాస్య నటుడిగానూ, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణించారు. చాలా కాలం నుంచి ఆయన వెండి తెరపై కనిపించడం లేదు. అయితే ఈ గ్యాప్‌లో ఆయన చిరకాల స్వప్నం ఒకటి నెరవేర్చుకున్నారు. జయప్రకాష్ రెడ్డి రంగ స్థలం నుంచి వచ్చిన నటుడు. స్టేజీపై ఎన్నో రకాల పాత్రలు వేశారు. అందులో `అలెగ్జాండర్` అనే ఏక పాత్రాభినయం ఆయనకెంతో పేరు తీసుకొచ్చింది. ఎన్నో అవార్డులూ దక్కాయి. వందలాది ప్రదర్శనలిచ్చి నాటకరంగ `అలెగ్జాండర్`గా పేరు తెచ్చుకున్నారు.
ఈ ఏక పాత్రాభినయాన్ని వెండి తెరపై తీసుకురావాలన్నది ఆయన కల. ఇప్పుడు అది నెరవేరింది. `అలెగ్జాండర్` అనే సినిమాని ఆయన నటిస్తూ నిర్మించారు. షూటింగ్ కూడా పూర్తయింది. ధవళ సత్యం దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. సినిమా మొత్తం ఒకే నటుడు కనిపించడం ఒక రకంగా ప్రయోగమే. వెండి తెరపై ఈ ప్రయోగానికి ఎన్ని మార్కులు పడతాయో చూడాలి.