తమిళనాడు ప్రజల హృదయాల్లో 'అమ్మ'గా చెరగని ముద్ర వేయించుకున్న జయలలిత బయోపిక్ తెరకెక్కబోతోందన్న సంగతి తెలిసిందే. మహిళా దర్శకురాలు ప్రియదర్శిని ఈ బయోపిక్‌ని తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ బయోపిక్ టైటిల్ లోగో పోస్టర్ విడుదలైంది. ప్రముఖ దర్శకుడు మురగదాస్ ఈ పోస్టర్‌ని తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిగా తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన జయలలిత సినీ జీవితం, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన పలు కీలక అంశాలను ఈ బయోపిక్‌లో ప్రస్థావించనున్నారట. అయితే ఈ బయోపిక్‌లో టైటిల్ పాత్ర పోషించేదెవరనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
అందం, అభినయం, ఆహార్యం ఉన్న నిత్యామీనన్‌ని ఈ పాత్ర కోసం పరిశీలిస్తున్నారట. అలాగే పలు సీనియర్ హీరోయిన్స్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. 'మహానటి'తో అలనాటి మేటి నటి సావిత్రిని మరపించిన కీర్తి సురేష్ పేరు కూడా ఈ లిస్టులో ఉంది. పేపర్ టేల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్‌పై పేర్కొంది.
మరోవైపు జయలలిత బయోపిక్‌ని తెరకెక్కించేందుకు మరికొంతమంది డైరెక్టర్లు రెడీగా ఉన్నారు. వారిలో 'మదరాస పట్టణం' ఫేం విజయ్ ఒకరు. అలాగే జయలలిత, ఆమె ప్రాణ స్నేహితురాలు శశికళ ఇద్దరి మధ్య స్నేహానికి సంబంధించిన యాంగిల్‌ని తెరపై చూపిస్తానని సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే.