సినిమాకు వివాదాలు కొత్త పబ్లిసిటీని తెచ్చిపెడుతున్నాయి. వివాదాలు తెచ్చిపెట్టే ఫ్రీ పబ్లిసిటీతో సినిమాల భవితవ్యమే మారిపోతోందిప్పుడు. అయితే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' చిత్రం మాత్రం వివాదాలకు ఏరకంగానూ వేదిక కాకుండా వుండేలా క్రిష్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.
ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం పలు వివాదాలతో కూడుకున్నది. అభిమానులకు తెలిసింది కొంత. తెలియనిది సముద్రమంత. అయితే ఆ వివాదాలేమీ తెరపై చూపించే ప్రయత్నం చేయడం లేదనీ క్రిష్ సంకేతాలు పంపిస్తున్నాడు. వివాదాలతో ఒక్కోసారి వచ్చే ముప్పు తిప్పలు అన్నీ ఇన్నీ కావు. చిన్న సినిమాల విషయంలో వివాదాలు పబ్లిసిటీ అయితే కావచ్చు కాక. కానీ ఎన్టీఆర్ బయోపిక్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోంది.
అభిమానుల మనోభావాల్ని కానీ, ఆయనతో సంబంధం ఉన్న ఏ ఇతర వ్యక్తుల మనోభావాల్ని కానీ కించపరిచేలా ఈ స్టోరీ ఉండకూడదనీ, ఎన్టీఆర్ జీవితంలోని క్లీన్ అంశాలను ఎంచుకుని స్క్రిప్టు ప్రిపేర్ చేశాడనీ తెలుస్తోంది. అయితే ఏదో ఒక కాంట్రవర్సీ లేకుంటే సినిమాపై ఆశక్తి ఎలా ఉంటుంది అనేది ఒక వర్గం వాదన.
ఇదిలా ఉంటే, సినిమాలోని కీలక పాత్రధారుల పోస్టర్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమాపై ఉన్న ఆశక్తిని మరింత పెంచేస్తున్నాడు క్రిష్. మొన్న సీఎం నారా చంద్రబాబునాయుడి గెటప్‌లో రానా లుక్‌నీ, నిన్న ఏఎన్నార్ గెటప్‌లో సుమంత్ లుక్‌నీ విడుదల చేసి ఆల్రెడీ ప్రశంసలు దక్కించుకుంటున్నాడు క్రిష్. నెక్స్ట్ రాబోయే పోస్టర్ ఎవరిదవుతుందా? అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. బహుశా ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పోస్టర్‌ని రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తోంది.