జయప్రకాష్ రెడ్డి మరణం.. చిత్రసీమని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన అకాల మరణం చిత్రసీమకు తీరని లోటే. నాటకరంగంతోనూ ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన నాటకాల నుంచి.. సినిమాలవైపు అడుగుపెట్టినవారే. సినిమాల్లోకి వచ్చినా, నాటకాలపై ప్రేమ తగ్గలేదు. సినిమా నటుడిగా బిజీగా ఉన్నప్పుడు కూడా ఏదో ఓ నాటకంతో మెరిసేవారు. చిన్నప్పటి నుంచీ.. ఆయనకు నాటకాలంటే మక్కువ. ఆయన స్త్రీ పాత్రతో అరంగేట్రం చేశారు. అప్పట్లో ఆయన చాలా సన్నగా ఉండేవారు. అందుకే స్త్రీ వేషం రక్తి కట్టింది.
తొలి నాటకం, తొలి పాత్రతోనే ఉత్తమ నటి అవార్దు దక్కించుకున్నారు. అప్పటి నుంచీ... నాటకాలతో అనుబంధం ముడిపడిపోయింది. అలెగ్జాండర్ అనే నాటకం ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇది ఏక పాత్ర ఉన్న నాటకం. దాదాపు 100 నిమిషాల నిడివి గల అతి పెద్ద నాటకం. అందులో అలెగ్జాండర్ గా... జయప్రకాష్ రెడ్డి నట విన్యాసాలు నాటకరంగంలో ఆయనకు అభిమానులు ఏర్పడేలా చేశాయి. ఈ నాటకాన్ని సినిమాగా కూడా తీయాలనుకున్నారు. దానికి ఆయనే దర్శకుడు కూడా. కానీ.. ఆ ప్రయత్నాలు మధ్యలో ఆగిపోయాయి.