వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి నటుడు జె.డి.చక్రవర్తి నిర్మాతగా వ్యవహరించనున్నారనే గాసిప్స్ వచ్చాయి మొదట్లో. కాదని వర్మ ఖండించేశాడు అప్పుడే. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సి. రాకేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా అఫీషియల్‌గా ప్రకటించడం జరిగింది. కాగా, జె.డి.చక్రవర్తి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తారంటూ తాజాగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ ముఖ్య పాత్ర కోసం జె.డి.చక్రవర్తిని ఎంచుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అది కూడా చంద్రబాబు పాత్రనీ ప్రచారం జరుగుతోంది. అవును నిజమే చంద్రబాబు పాత్రలో చక్రి అయితే బాగా సూటయిపోతాడు. కానీ ఇది ప్రస్తుతానికి ప్రచారం మాత్రమే. వర్మ ఫిక్స్ చేయాలి కదా. వర్మ క్యారెక్టర్ ఫిక్సింగ్ చేస్తే, రియాలిటీ ఉట్టి పడుతుంది ఆ క్యారెక్టర్‌కి. ఆయన సినిమాల్లోని క్యారెక్టర్స్ అన్నీ రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. బయోపిక్స్‌ని తెరకెక్కించడంలో వర్మ దృష్టి కోణం ఇంకా ఫర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. అలాంటిది ఎన్టీఆర్ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ చిత్రంలో నటించబోయే నటీనటుల ఎంపిక లో వర్మ అతి జాగ్రత్తలే తీసుకుంటున్నారు. కాన్సెప్ట్‌కి ఉన్న పాపులారిటీని బట్టి, ఈ క్యారెక్టర్‌లో ఈ నటీనటులు అనే ప్రచారం జరగడంలో వింతేమీ కాదు. ఎన్టీఆర్ పాత్రలో ప్రకాష్ రాజ్ అనీ, లక్ష్మీ పార్వతి పాత్రలో రోజా అనీ ప్రచారాలు జరుగుతున్నాయి ఇప్పటికే. కానీ అవేమీ నిజం కావనీ వర్మ తేల్చేస్తూ వస్తున్నారు. అలాగే జె.డి.చక్రవర్తి విషయంలో ఏం జరుగుతుందో తెలీదు కానీ, చక్రి, వర్మకి ప్రియ శిష్యుడు. 'అనగనగా ఒక రోజు', 'సత్య', శివ' తదితర వర్మ చిత్రాల్లో చక్రి నటించాడు. ఒకవేళ ఆ రకంగా చక్రికి ఏదైనా ఇంపార్టెంట్ రోల్ ఇస్తాడేమో ఈ సినిమాలో చూడాలి.