నటి, నిర్మాత, దర్శకురాలు జీవితకు కోపం వచ్చింది. ఈసారి ఈ కోపం రివ్యూలు రాసేవాళ్లమీద, తన పేరుని ట్రోల్ చేసేవాళ్లపైన. ఇటీవల జీవిత కూతురు శివాత్మిక కథానాయికగా నటించిన `దొరసాని` విడుదలైన సంగతి తెలిసిందే. విమర్శకులు ఈ సినిమాని చూసి పెదవి విరిచారు. సినిమా బాగోలేదని తేల్చేశారు. దాంతో జీవితకు కోపం వచ్చింది. `నేనేం మాట్లాడిన ట్రోల్ చేస్తారని తెలుసు.
నా వ్యాఖ్యల్ని రకరకాలుగా వక్రీకరించి వీడియోలు చేసుకోవడం, శవాలపై చిల్లర ఏరుకోవడం ఒక్కటే` అంటూ ఘాటుగా విమర్శించింది. ఇది వరకు ఓ సినిమా విడుదలైతే, వారం రోజుల తరవాత సమీక్ష వచ్చేదని, ఇప్పుడు థియేటర్లో కూర్చుని సినిమాని విశ్లేషించడం మొదలెడుతున్నారని, సినిమాని ఒక్కొక్కరూ ఒక్కో కోణంలో చూస్తారని, విమర్శకుడి అభిప్రాయాన్ని ప్రేక్షకులపై రుద్దవద్దని కోరారు జీవిత.
రివ్యూల వల్ల బిలో యావరేజ్ సినిమాలు కూడా నాశనం అయిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా నిలబడడానికి కొంత సమయం ఇవ్వాలని, ఆ తరవాతే రివ్యూ రాయాలని ఆమె కోరారు. తనకు `దొరసాని` బాగా నచ్చిందని, ఇప్పటికే మూడుసార్లు చూశానని, ఆనంద్, శివాత్మిక బాగా నటించారని కితాబిచ్చారామె.