ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా ప్రేక్షకులకు మరియు సామాన్య ప్రజానీకానికి శ్రీమతి జీవితా రాజశేఖర్ బహిరంగ విన్నపం.
తెలుగు సినిమా అభిమానులకు మరియు సామాన్య ప్రజానీకానికి మరియు నా కుటుంబాన్ని అభిమానించే వారికి నా నమస్కారాలు. ఈ నెల 14వ తారికున TRP రేటింగే పరమావధిగా తమ ఎదుగుదల కోసం ఎవరిపైన బురద చల్లడానికైనా వెనుకాడని ఘనత వహించిన “MAHAA NEWS' అనే దగా, న్యూస్ ఛానల్ వారు నిర్వహించిన చర్చా కార్యక్రమంలో అసందర్భంగా తానొక మహిళను అని మరిచిపోయిన ఒక మహిళా నాయకురాలు ఏరకమయిన సాక్ష్యాధారాలు లేకుండా నా మీద నా కుటుంబం మీద నా వ్యక్తిగత మరియు కుటుంబ పరువు ప్రతిష్టలు దిగజార్చే విధంగా మాట్లాడిన విషయం మీ అందరికి తెలుసు.
సదరు విషయం ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆధారాలు ఏమిటి అని ప్రశ్నించకుండా ఆమె మాట్లాడింది అంతా నిజమే అని ప్రజలను నమ్మించే విధంగా ప్రవర్తించిన సదరు మహా న్యూస్ ప్రయోక్త మూర్తి గారికి మరియు నిరాధారమైన ఆరోపణలు చేసిన POW సంధ్యకు ఇదే నా సమాధానం.
ఛానల్ చేతిలో ఉంది కదా అని ఏమైనా మాట్లాడగలం అనుకోవద్దు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినందుకు మీ మీద నేను తీసుకొనబోవు సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్ధంగా ఉండండి అని హెచ్చరిస్తున్నాను. మరియు ఇటువంటి నిరాధారమైన వార్తలను నమ్మ వద్దు అనీ, ఇవన్ని నేను సినిమా రంగంలోని "Casting Couch" మీద వేయబోయే కమిటీలో ఒక సభ్యురాలిగా ఉండబోతున్నానని తెలుసుకుని దాని వల్ల వారికేదో అన్యాయం జరుగుతుందని ఊహించి కొందరు పధకం ప్రకారం ఆడుతున్న నాటకం అని మీ అందరికి మనవి చేస్తున్నాను.
Central Censor Board మెంబర్ గా గౌరవనీయమైన పదవిలో ఉన్న నేను ఇటువంటి 'C' గ్రేడ్ న్యూస్ ఛానల్ గురించి, సంసారాలు నాశనం చేసుకుని పబ్లిసిటీ కోసం ఎవరి మీద పడితే వాళ్ళమీద అసత్య ప్రచారాలు చేసుకుంటూ రోజు TVలలో కనపడే వాళ్ళకు, నేను అదే ఛానళ్ళలో కూర్చొని నా సమాధానం చెప్పడం ఇష్టం లేక ఈ బహిరంగ ప్రకటన విడుదల చేస్తున్నాను..
ఒక స్త్రీ గా నేను ఏనాడు సాటి ఆడదానికి అన్యాయం చెయ్యలేదని వారు ఆరోపించినవన్నియు నిరాధారమైనవి అని మరియు అవి వారి ఊహలని తెలియచేస్తూ, ఇటువంటి తప్పుడు ప్రచారాలను ప్రసారం చేస్తున్న సదరు ప్రసార మాధ్యమాలను ప్రజలే భాహిష్కరించాలని కోరుతూ
ఇట్లు మీ జీవితా రాజశేఖర్.
-ప్రెస్ రిలీజ్