అయ్యో ఇదేదో సినిమా టైటిల్ అనుకునేరు. కాదండీ బాబూ. మెగాస్టార్ చిరంజీవి పర్యవేక్షణలో పలువురు సినీ పెద్దల సమక్షంలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతోన్న 'మా' అసోసియేషన్ సభలో నటుడు రాజశేఖర్ 'మా'లోని గొడవలను ఎత్తి చూపుతూ అగ్రెసివ్‌గా మాట్లాడి, సభను రసాభాస చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భార్య జీవిత సభా ప్రముఖులందరికీ క్షమాపణలు తెలిపారు. ఆ క్రమంలోనే 'మా ఆయన చిన్న పిల్లాడు.. దయ చేసి క్షమించండి..' అంటూ జీవిత సభలోని వారందర్నీ కోరారు.
రాజశేఖర్ తన దురుసు స్వభావాన్ని ప్రదర్శించినా, ఆ తర్వాత ఆయన తరపున క్షమాపణలు తెలుపుతూ జీవిత విజ్ఞతను చాటుకున్నారు. ఈ తతంగం అంతా పూర్తయ్యాక, సభ చివరిలో మెగాస్టార్ చిరంజీవి మైక్ తీసుకుని, ఈ సభలో చాలా చాలా మంచి విషయాలు జరిగాయి. సభ చాలా చాలా సరదాగా జరిగింది. దీన్నింతటినీ బాగా హైలైట్ చేయండి. కానీ, ఇక్కడ జరిగిన చెడును మీరు హైలైట్ చేస్తూ వార్తలు రాయకండి దయచేసి.. అంటూ మీడియా మిత్రులను విజ్ఞప్తి చేస్తూ, ఆయన పెద్దరికం చాటుకోవడం విశేషం. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు.