పవన్ కల్యాణ్‌పై పోసాని కృష్ణమురళి రెచ్చిపోయిన తీరు - టాలీవుడ్ మొత్తాన్ని విస్మయపరిచింది. రాజకీయాల పరంగా ఇద్దరి మధ్యా ఎన్ని విబేధాలైనా ఉండొచ్చు గాక.. కానీ.. చిత్రసీమలో ఉన్న ఓ వ్యక్తి.. మరో నటుడిపై ఈ విధంగా దుర్భాషలాడడం - హర్షించదగిన పరిణామం కాదు. నిజానికి పోసాని వ్యవహరించిన తీరుపై చిత్రసీమ దృష్టి సారించాల్సిన తరుణమిది. కానీ ఎవరి రాజకీయాలు వాళ్లవి. కాబట్టి... ఎవరూ నోరు మెదపలేదు. కానీ ఈ వ్యవహారంపై జీవిత ఘాటుగా స్పందించారు.
''నేను పవన్ తరపునో, పోసారి తరపునో మాట్లాడడం లేదు. పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తిగా చెబుతున్నా. పోసాని మాట్లాడిన విధానం ముమ్మాటికీ తప్పు. పవన్ ని వ్యక్తిగతంగా ఎన్నయినా అనుకోవొచ్చు. కానీ భార్య, పిల్లల గురించి మాట్లాడడం తప్పు? పోసాని ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు కదా? ఆయన అలా మాట్లాడొచ్చా'' అని ప్రశ్నించారు. ''చిత్రసీమ ఈ విషయంలో యాక్షన్ తీసుకోవాల్సిందే. కానీ ఇప్పటి వరకూ తీసుకోలేదు.
`మా` ఎన్నికలు జరుగుతున్నాయి. మా ప్యానల్ గెలిస్తే.. తప్పకుండా పోసానిపై యాక్షన్ తీసుకుంటాం. ఆయన్ని బ్యాన్ చేయడమో, హెచ్చరించడమో చేస్తాం. మేం కాకపోయినా ఎవరు గెలిచినా, ఈ విషయంపై దృష్టి సారించాలి'' అని జీవిత కోరారు.