జీవిత అంటే రాజశేఖర్.... రాజశేఖర్ అంటే జీవిత. వీరిద్దరి అన్యోన్య దాంపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. పెళ్లయ్యాక.. జీవిత కేవలం ఇంటికే పరిమితమయ్యారు. రాజశేఖర్ సినిమాలకు సంబంధించి, తెర వెనుక పనులు చేశారు. మధ్యలో దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే.. నటనకు మాత్రం పూర్తిగా దూరమయ్యారు. ఎప్పుడైనా ఆ టాపిక్ వచ్చినా `ఇప్పుడు నటించే ఉద్దేశం లేదు` అని బాహాటంగానే చెప్పేసేవారు. అయితే ఇప్పుడు ఆమె మనసు మళ్లీ నటన వైపుకు మళ్లుతోంది. మంచి పాత్ర వస్తే చేస్తానని ప్రకటించేశారు.
``మంచి పాత్రలొస్తే చేస్తా. పాత్ర నచ్చితే చాలు. అమ్మగానైనా, బామ్మగానైనా నటించడానికి సిద్ధమే. నేనూ, రాజశేఖర్ గారు, మా పిల్లలూ కలిసి నటించే కథేమైనా వస్తుందేమో అని ఎదురు చూస్తున్నా. అదొచ్చినా చేయడానికి సిద్ధమే. పెద్ద హీరో సినిమా, చిన్న హీరో సినిమా అని కూడా చూడను`` అని చెప్పుకొచ్చారు. ఈమధ్య వెటరన్ కథానాయికలు అమ్మ, వదిన, అత్త పాత్రల్లో మెరుస్తున్న సంగతి తెలిసిందే. అటు వంటి అవకాశాల కోసమే... జీవిత ఎదురు చూస్తున్నారేమో..?