ఇది వరకు బాలీవుడ్ సినిమా అంటే దక్షిణాదికి భయం. దేశమంతా విడుదల అవుతాయి, స్టార్ హంగామా ఉంటుంది కాబట్టి.. వాళ్లకు పోటీగా మన సినిమాల్ని విడుదల చేసే ధైర్యం ఉండేది కాదు. ఓ బాలీవుడ్ సినిమా వస్తోందంటే, ప్రాంతీయ భాషా చిత్రాలు కాస్త వెనక్కి తగ్గేవి. అయితే ఇప్పుడు ఆ విధానం మారింది. దక్షిణాది సినిమానిచూసి బాలీవుడ్ భయపడుతోంది. రిలీజ్ డేట్లు మార్చుకుంటోంది. జెర్సీ విషయంలో అదే జరిగింది.
తెలుగులో సూపర్ హిట్ అయిన జెర్సీని బాలీవుడ్ లో అదే పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ హీరో. ఈ సినిమాని ఏప్రిల్ 14న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ అదే రోజున... `కేజీఎఫ్` రిలీజ్ కి రెడీ అయ్యింది. కేజీఎఫ్ 2 మానియా.. దేశమంతా ఉంది. సౌత్ ఈ సినిమా ధాటికి ఊగిపోతోంది. అడ్వాన్స్ బుకింగులు ఓపెన్ చేస్తే... అన్ని టికెట్లూ.. కేజీఎఫ్ 2కే తెగుతున్నాయి. జెర్సీని పట్టించుకున్నవాళ్లే లేరు. దాంతో.. జెర్సీ టీమ్ ఖంగుతింది. షాహిద్ చిన్న హీరో ఏం కాదు. అర్జున్ రెడ్డి బాలీవుడ్ లో రీమేక్ చేసి 200 కోట్లు కొల్లగొట్టాడు. అలాంటి హీరోనే... ఇప్పుడు వెనకడుగు వేయాల్సివచ్చింది. పైగా.. 14న రిలీజ్ పెట్టుకుని జెర్సీ టీమ్.. ఎలాంటి ప్రమోషన్లూ చేయలేదు. ఎలాగూ వాయిదా వేయాల్సివస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నారేమో..? ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓ వారం ఆలస్యంగా.. ఏప్రిల్ 22న విడుదల చేయబోతున్నారు.