అతిలోక సుందరిగా సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన బ్యూటీ శ్రీదేవి. తెలుగుతో పాటు తమిళ, హిందీ తదితర భాషల్లోనూ శ్రీదేవి హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఈ అతిలోక సుందరి కూతురు ఇప్పుడు వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. అయితే గత కొంత కాలంగా శ్రీదేవి కూతురు జాహ్నవి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. శ్రీదేవి ఎక్కడ కనిపించినా ఆమెకు మొదటగా మీడియా నుండి ఎదురయ్యే ప్రశ్న, జాహ్నవి ఎంట్రీ ఎప్పుడు? అని.
అయితే ఈ ప్రశ్నలతో విసిగిపోయిన శ్రీదేవి ఆమె ఎంట్రీ ఎప్పుడనేది తానే చెబుతాననీ అంతవరకూ అడగొద్దనీ తేల్చి చెప్పేసింది. అయితే తాజాగా జాహ్నవి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సినిమా ఖరారైపోయింది. అంతేకాదు ఫస్ట్‌లుక్ కూడా వచ్చేసింది. దాంతో షాక్ అవ్వడమే అందరి వంతయ్యింది. అసలింతకీ ఎప్పుడు సినిమా ఖరారయ్యింది. ఎప్పుడు షూటింగ్‌కి వెళ్లింది అనే విషయాలేమీ తెలియకుండా సడెన్‌గా వెండితెరపై ఆమె తెరంగేట్రం చేస్తున్న సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. సినిమా పేరు 'ధడక్'.
మరాఠీలో చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాధించిన 'సైరాత్'కి ఇది హిందీ రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమాలో జాహ్నవికి జోడీగా హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖత్తర్ నటిస్తున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియో సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. శశాంక్ ఖైతర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఏ మాటకామాటే చెప్పాలి. ఈ ఫస్ట్‌లుక్‌లో జాహ్నవి అచ్చం తల్లిలానే ఉందని చెప్పలేం కానీ, తల్లికి తగ్గ అందంతో ఆకట్టుకుంటుంది. ఎప్పటినుండో శ్రీదేవి కూతురు ఇదిగో వస్తోంది. అదిగో వస్తోంది అని ఎదురు చూసిన అభిమానులకు ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరినట్లే అనిపిస్తోంది. అయితే తల్లిలా సక్సెస్ అవుతుందో లేదో చూడాలంటే కొంత కాలం ఎదురు చూడాల్సిందే!