జాన్వీ కపూర్‌ని సౌత్ ప్రేక్షకులకు పరిచయం చేసే ఛాన్స్ ఎలాగైనా తనకే దక్కాలని ఆరాటపడుతున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. పూరీ తన కంపెనీ నుండి చాలా మంది ముద్దుగుమ్మల్ని పరిచయం చేశాడు. అలాగే స్వయానా అతిలోక సుందరి కూతురు జాన్వీని తెలుగులోకి తీసుకొచ్చే అవకాశం దక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'ఫైటర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ప్యాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కించాలన్నది పూరీ ఆలోచన. అందుకే ఈ సినిమాకి హీరోయిన్ విషయంలో చేసే ఆలోచన ఆ స్థాయిలో ఉంది.
ఈ సినిమా నిర్మాణంలో ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత అయిన కరణ్ జోహార్ హస్తం ఉండడంతో, కరణ్ జోహార్ ద్వారా జాన్వీని కదిలించే యోచన చేస్తున్నాడట పూరీ. జాన్వీకపూర్‌ని హీరోయిన్‌గా పరిచయం చేసిన ఘనత కరణ్ జోహార్‌దే. సో కరణ్ చెబితే జాన్వీ కాదనదు. కరణ్ హస్తం 'ఫైటర్'కి ఉండడంతో, ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఎంట్రీ షురూ అవ్వడం ఖాయమని శ్రీదేవి అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాని హిందీతో పాటు పలు భాషల్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఒకవేళ అన్నీ కుదిరి జాన్వీ ఈ సినిమాకి ఓకే అనేస్తే, ఎట్ ఏ టైమ్ ఈ సినిమాతో సౌత్ భాషలన్నింటినీ పలకరించినట్లే అవుతుంది. ఈ సినిమా కోసం జాన్వీకి ఏకంగా 3.5 కోట్లు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే, మన సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ బాలీవుడ్ కల ఈ సినిమాతో నెరవేరబోతోందన్న మాట.