ఓ పక్క ఎన్టీఆర్ హీరోగా 'జై లవకుశ' సినిమా, మరో పక్క మహేష్ బాబు హీరోగా 'స్పైడర్' రెండు సినిమాలు బాక్సాఫీస్ వసూళ్లు కుమ్మరించడానికి భారీ అంచనాలతో వచ్చేస్తున్నాయి. రెండూ భారీ చిత్రాలే. హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య విడుదలవుతున్న సినిమాలు. ఈ దసరాకి ఈ రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 21న 'జై లవకుశ' సినిమా విడుదలవుతుండగా, 27న 'స్పైడర్' ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో తన మనుసులోని మాటలు మీడియాతో పంచుకున్నారు. రెండు సినిమాలు మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాననీ ఆయన అన్నారు. సంక్రాంతికి విడుదలైన భారీ చిత్రాలైన 'ఖైదీ నెం150', 'గౌతమీ పుత్ర శాతకర్ణి' బాక్సాఫీస్ వద్ద హయ్యెస్ట్ వసూళ్లను సాధించాయి. ఏ సినిమా అయినా మంచి వసూళ్లు సాధిస్తేనే అసలు సిసలు విజయం. ఇది ఏ ఒక్క హీరోకో సంబంధించిన విజయం కాదు. టోటల్ తెలుగు ఇండస్ట్రీ సాధించిన విజయం. ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పుడే ఇండస్ట్రీ కళకళలాడుతుందని ఎన్టీఆర్ అన్నారు.అలాగే ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీగా వచ్చిన చిన్న హీరో శర్వానంద్ 'శతమానం భవతి' సినిమా కూడా హయ్యెస్ట్ వసూళ్లు సాధించి పెట్టింది. పండక్కి ఎన్ని సినిమాలు వచ్చినా ఆదరించే పెద్ద మనసు ప్రేక్షకులకు ఉంది అంటూ ఎన్టీఆర్ చెప్పారు. అలాగే ఇప్పుడు కూడా మా ఇద్దరితో పోటీకి వస్తున్న శర్వానంద్ 'మహానుభావుడు' సినిమా కూడా హిట్ అవ్వాలని ఎన్టీఆర్ అన్నారు. వారం రోజుల తేడాలో ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈ మూడు సినిమాలు మంచి విజయం సాధించాలని ఎన్టీఆర్‌లాగా మనం కూడా ఆశిద్దాం.