'అరవింద సమేత..'తో ఎన్టీఆర్ వంద కోట్లు క్లబ్‌లో చేరడం ఖాయమని విడుదలకు ముందు అంచనా వేశారు. కానీ ఎన్టీఆర్‌కి ఆ కోరిక తీరేలా కనిపించడం లేదు. 84 కోట్ల దగ్గరే ఆగిపోయేలా ఉంది. ఇంకా 84 కోట్లకు కాస్త అటూ ఇటూ దగ్గరలో ఉన్న 'అరవింద సమేత..' 100 కోట్లు చేరుకోవడం కష్టమే అంటున్నాయి ప్రస్తుతం ట్రేడ్ వర్గాలు.
ఓపెనింగ్స్ అదరగొట్టేశాడు. తొలి మూడు రోజుల్లో వసూళ్ల ప్రభంజనం సృష్టించాడు. కానీ ఆ తర్వాత కొంచెం స్లో అయ్యాడు. ఇక మొదటి వారం తిరిగే సరికి బాగా స్లో అయ్యింది అరవింద సమేత వసూళ్ల లెక్క. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా దసరా సెలవులు ముగిసేసరికి బాక్సాఫీస్ వద్ద జోరు పూర్తిగా తగ్గిపోయింది. 'రంగస్థలం' తర్వాత వచ్చిన పెద్ద సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలు నిరాశలైనట్లే అనిపిస్తోందిప్పుడు.
ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి వంద కోట్లు సినిమా అవుతుందని భావించారు. కానీ ఎంతమాత్రమూ ఆ పరిస్థితి కనిపించడం లేదు. 150 కోట్లు గ్రాస్ దాటిందని ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు కానీ, షేర్ పరంగా మాత్రం 80 కోట్లుకు కాస్త అటూ ఇటూగా ఉంది. అదీ అరవింద సమేత.. పరిస్థితి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తొలిసారి నటించిన చిత్రమిది. హారికా హాసినీ బ్యానర్‌లో రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటించింది. తెలుగమ్మాయి ఈషారెబ్బ మరో ఇంపార్టెంట్ రోల్ పోషించింది.