ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న 'జై లవకుశ' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఎన్టీయార్ తనదైన స్టైల్లో చెలరేగిపోతున్నాడట. ముఖ్యంగా 'జై' పాత్ర కోసం ఎన్టీయార్ డబ్బింగ్ చెబుతున్న తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోందని సమాచారమ్. 'జై లవకుశ' సినిమాలోని 'జై' పాత్రకి ప్రత్యేకంగా టీజర్‌ని ఇప్పటికే విడుదల చేశారు. అది నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. 'రావణుడి' తరహాలో ఆ పాత్రని డిజైన్ చేశారు. ఆ టీజర్‌కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాత్రకి కొంచెం నత్తి ఉన్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. అలాగే చాలా చాలా పవర్ ఫుల్ పాత్రనీ తెలియవస్తోంది. అందుకే ఈ పాత్రకి డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఎన్టీఆర్ చాలా కొత్తగా ఫీలవుతున్నాడట. అలాగే త్వరలో అంటే ఈ వినాయక చవితి సందర్భంగా 'లవకుమార్' పాత్ర తాలూకు టీజర్ రాబోతోంది. రెండో పాత్రకి సంబంధించిన లుక్ కూడా ఆల్రెడీ విడుదలయ్యింది. సాఫ్ట్ అండ్ హ్యాండ్సమ్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు ఈ పాత్రలో ఎన్టీఆర్. ఇక ముచ్చటగా మూడో పాత్రలో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడనేదే ప్రస్తుతానికి సస్పెన్స్ కాగా, మరి కొద్ది రోజుల్లోనే ఆ సస్పెన్స్‌కి తెర పడనుంది. మూడు భిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని రూపొందిస్తున్నారు. రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.