ఇప్పుడు అందరి కళ్లూ.. ఆర్.ఆర్.ఆర్‌పైనే ఉన్నాయి. రాజమౌళి - రామారావు - రామ్ చరణ్‌లు కలసి ఏ అద్భుతాన్ని సృష్టించబోతున్నారా? అంటూ చిత్రసీమ మొత్తం ఎదురుచూస్తోంది.
ఈ సినిమాకి సంబంధించి రాజమౌళి ఇప్పటి వరకూ ఎలాంటి క్లూ ఇవ్వలేదు. అయితే బయట మాత్రం గాసిప్పులకు కొదవలేకుండా పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ పాత్రపై ఓ క్లూ దొరికింది. ఈసినిమాలో ఎన్టీఆర్ ప్రతినాయకుడిగా కనిపిస్తాడని టాక్. జై లవకుశలో తొలిసారి తనలోని నెగిటీవ్ యాంగిల్ బయటపెట్టాడు తారక్. ఆ స్ఫూర్తితోనే తారక్‌ని విలన్ పాత్రలో చూపించడానికి డిసైడ్ అయ్యాడట రాజమౌళి.
రాజమౌళి సినిమాల్లో ప్రతినాయకుడి పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే హీరో పాత్రని విలన్ పాత్ర డామినేట్ చేస్తుంటుంది. అందుకే రాజమౌళి సినిమాలో విలన్లకు అంత పేరు వచ్చింది. ఈసారి హీరోనే విలన్ చేసేసే ప్రయత్నం చేస్తున్నాడు రాజమౌళి. ఎన్టీఆర్ - రామ్ చరణ్‌ల మధ్య టామ్అండ్ జెర్రీలా సాగే కథ రాసుకున్నాడట.
ఈ పాత్రలు నచ్చే ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ మరో మాట లేకుండా.. సినిమా చేయడానికి ముందుకొచ్చారని సమాచారం. వచ్చే నెల ద్వితీయార్థంలో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈలోగా చరణ్ పాత్రపై కూడా ఓ క్లారిటీ వస్తుందేమో చూడాలి.