రాఘవేంద్రరావు.. సూటిగా సుత్తిలేకుండా

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకున్న ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని ఉద్దేశించి దర్శకుడు రాఘవేంద్రరావు స్పందించారు. ''ప్రస్తుతం టికెట్లు, సినిమా ప్రదర్శనలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చాలామంది తీవ్ర నష్టాలకు గురవుతారు. ఆన్ లైన్ వలన దోపీడీ ఆగిపోతుందని అనుకోవడం కరెక్ట్ కాదు''అని స్పష్టం చేశారు రాఘవేంద్రరావు .

 

''షోల సంఖ్య, టికెట్ల ధర తగ్గించటం వల్ల సినిమా వాళ్లు నష్టపోతారు. ఒక హిట్‌ సినిమాకు ఎక్కువ షోలు ప్రదర్శించినా, తొలివారం టికెట్ల ధరలు పెంచినా థియేటర్‌ యాజమాన్యం, వారిని నమ్ముకున్న కొన్ని వేల మందికి 2, 3 నెలలకి సరిపడా ఆదాయం వస్తుంది. ఆ తర్వాత వచ్చే సినిమాలు ఫ్లాప్‌ అయినా... ఇండస్ట్రీ ఇబ్బందిపడదు. 100 సినిమాల్లో 10 శాతం హిట్స్‌ అవుతాయి, మరో 10 శాతం యావరేజ్‌గా నిలుస్తాయి. ఇది అందరికీ తెలిసిన సత్యం. ప్రేక్షకుడు మంచి సినిమా చూడాలనుకుంటే టికెట్‌ ధర రూ. 300 అయినా, రూ. 500 అయినా చూస్తాడు. రూపాయికే సినిమా చూపిస్తామన్నా అతనికి నచ్చని సినిమా చూడడు. పైగా ఆన్‌లైన్‌లో చాలామంది ఇన్‌ఫ్లూయెన్స్‌ ఉన్నవారు బ్లాక్‌ చేసుకుని, వారి శిష్యుల ద్వారా బ్లాక్‌లో అమ్మవచ్చు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగిన న్యాయం చేకూర్చాలని ఆశిస్తున్నా'' అని వెల్లడించారు రాఘవేంద్రరావు

 

ఇప్పటికే చిరంజీవి తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు ఈ విషయం పై స్పందించిన సంగతి తెలిసిందే. అయితే వారి మాటల్లో కాస్త లౌఖ్యం కనిపించింది. చెప్పాల్సిన విషయం సూటిగా చెప్పకుండ పడికట్టుపదాలతో విన్నవించుకోవడం కనిపించింది. అయితే రాఘవేంద్ర రావు మాత్రం కొన్ని విషయాలు సూటిగా సుత్తిలేకుండా వెల్లడించారు. మరి రాఘవేంద్రరావు మాటలపై ఏపీ ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS