రాష్ట్రపతి సమక్షంలో కళాతపస్వి కె. విశ్వనాధ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. 64వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అరుదైన పురస్కారాన్ని ప్రముఖ తెలుగు సినీ దర్శకులు విశ్వనాద్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన 'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు' అంటూ తన ప్రసంగం అచ్చ తెలుగులో మొదలు పెట్టడం విశేషం. నేనీ స్థాయికి రావడానికి నా తల్లితండ్రులు, భగవంతుని ఆశీస్సులే కారణం' అని ఆయన తన ప్రసంగంలో తెలిపారు. అక్కడ తెలుగులో ప్రసంగించడమే ఓ గొప్ప అనుకుంటే ఈ స్థాయితో మన తెలుగు భాషకి గౌరవం దక్కేలా చేసిన గొప్ప వ్యక్తి విశ్వనాధ్. అందుకే ఆయన కళాతపస్వి అయ్యారు. అదే ఆయనలోని ప్రత్యేకత. తెలుగు భాషకి ఆయన ఇచ్చే ప్రాధాన్యత అదే. అంతేకాదు జాతీయ అవార్డుల చరిత్రలో అవార్డు గ్రహీత ప్రసంగించడం కూడా ఇదే తొలిసారి కావడం మరో ప్రత్యేకత. తెలుగు చిత్ర సీమకి విశ్వనాధ్ చేసిన కృషి అమోఘం అని రాష్ట్రపతి కొనియాడారు. ఇది వ్యక్తిగా ఆయనకి దక్కిన పురస్కారం మాత్రమే కాదు తెలుగు భాషకీ, తెలుగు చిత్ర పరిశ్రమకి దక్కిన అరుదైన గౌరవంగా భావించాలి. మరో పక్క ఇంత అపురూపమైన అవార్డు అందుకుని ఢిల్లీ నుండి హైద్రాబాద్ తిరిగి రానున్న కళాతపస్వికి తెలంగాణా ప్రభుత్వం ఘన స్వాగతం పలకనుంది. అందుకు తెలంగాణా ప్రభుత్వం గ్రాండ్‌గా ఏర్పాట్లు చేయనుంది.