బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' బయోపిక్‌లో కాస్టింగ్ ఒక్కొక్కటిగా యాడ్ అవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ షూటింగ్‌కి హాజరవగా, ఇతర ప్రధాన పాత్రల కోసం పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
అయితే తాజాగా ఈ చిత్రంలోకి మరో నటుడి పేరు యాడ్ అయ్యింది. ఆయన మరెవరో కాదు, నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ. 'భక్త ప్రహ్లాద', 'కాళిదాస' చిత్రాలతో దక్షిణాది సినిమాలకు పునాది వేసిన తెలుగు సినిమా పితామహుడు టైగర్ హెచ్ ఎం రెడ్డి పాత్రలో కైకాల సత్యనారాయణను ఎంచుకున్నారు. హెచ్.ఎమ్.రెడ్డి పాత్రలో కైకాల సత్యనారాయణ గెటప్‌ని తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్.
తెల్లని మెలి తిరిగిన మీసంతో, తలపై టోపీతో భూతద్దంలో ఫిల్మ్‌ని చూస్తున్నట్లుగా ఉన్న ఆయన గెటప్ ఆకట్టుకుంటోంది. విలన్‌గా, కమెడియన్‌గా, తండ్రిగా, తాతగా, మామగా, ఘటోత్కచుడు, యమధర్మరాజు వంటి పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరైన కైకాల సత్యనారాయణ.
ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో పరకాయం ప్రవేశం చేసేస్తారాయన. అందుకే ఆయన నవరస నట సార్వభౌముడి బిరుదాంకితుడు. అయితే గత కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు కైకాల. హెచ్.ఎం రెడ్డి పాత్రకు ఆయన అయితే సరైన న్యాయం జరుగుతుందని భావించి ఆ పాత్రకు ఆయన్ని తీసుకొచ్చారు. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.