ఒక్కసారి స్టార్డమ్ దక్కితే చాలు ఇక చిన్న హీరోలకు ఛాన్స్ ఇచ్చేవారు కాదు గతంలో ముద్దుగుమ్మలు. కానీ ప్రస్తుతం హీరోయిన్లు అలా కాదు. ఎట్ ఏ టైమ్ స్టార్ హీరోస్‌తోనూ, యంగ్ హీరోస్‌తోనూ జత కడుతున్నారు. దాదాపుగా మెగా కాంపౌండ్ హీరోస్తో జత కట్టిన చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్ యంగ్ హీరో రానాతో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో నటించింది.ఈ సినిమాకి ముందే మెగాస్టార్ 150వ చిత్రంలో నటించి, మెగా హీరోయిన్ అనిపించుకున్న ఈ బ్యూటీ, తేజ డైరెక్షన్లో రానాతో నటించడం ఏంటనుకుంటున్నారు. అయితే తాజాగా యంగ్ హీరో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాకి కాజల్ హీరోయిన్గా ఎంపికైంది.
సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న ఈ చిత్రం ఈ రోజే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి నాగ చైతన్య ఛీప్ గెస్ట్‌గా అటెండ్ అయ్యాడు. ఈ సినిమాలో శర్వానంద్ ఇద్దరు ముద్దుగుమ్మలతో జత కడుతున్నాడు. అందులో ఒకరు కాజల్ కాగా, మరో ముద్దుగుమ్మ నిత్యామీనన్. నిత్యామీనన్‌తో శర్వానంద్ గతంలో 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' చిత్రంలో నటించాడు. ఇదో అద్భుత ప్రేమ కావ్యం. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అందించిన నంది అవార్డుకు ఎంపికైంది ఈ సినిమా. కాగా తాజా చిత్రంతో నిత్యామీనన్ రెండో సారి శర్వానంద్‌తో జత కడుతోంది. అయితే కాజల్‌తో శర్వా తొలిసారిగా జత కడుతున్నాడు.
స్టార్‌డమ్‌ని పక్కన పెట్టి యంగ్ హీరోతో నటించేందుకు ఒప్పుకున్నందుకు కాజల్‌ని అభినందించకుండా ఉండలేము. చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కళ్యాణ్‌రామ్‌తో 'ఎమ్యెల్యే' చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్ 'క్వీన్'కి తమిళ రీమేక్‌లోనూ అందాల కాజలే లీడ్ రోల్ పోషిస్తోంది.