అందాల చందమామ కాజల్ అగర్వాల్ మళ్ళీ రేసులోకి దూసుకొచ్చింది 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో. 2016లో రెండు పెద్ద ఫ్లాపుల్ని చవిచూసిన తర్వాత కాజల్ అగర్వాల్ కెరీర్ ఆందోళనకరంగా మారినప్పటికీ, చిరంజీవి రూపంలో ఆమెకు సూపర్ ఛాన్స్ దక్కింది. చిరంజీవి రీ-ఎంట్రీ సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడంతోనే కాజల్ అగర్వాల్ దశ తిరిగిందని చెప్పవచ్చు. సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా 100 కోట్ల క్లబ్‌లోకి చేరడంతో కాజల్ అగర్వాల్‌ని ఇప్పుడంతా గోల్డెన్ బ్యూటీ అంటున్నారు. మెగా కాంపౌండ్‌లో రామ్‌చరణ్‌తో 'మగధీర' సినిమా చేసింది కాజల్. అది అప్పట్లో ఇండస్ట్రీ రికార్డ్. అలాగే చరణ్‌తోనే 'నాయక్' సినిమా కూడా కాజల్ అగర్వాల్ చేసి హిట్టు కొట్టింది. ఏదేమైనప్పటికీ 'ఖైదీ నెంబర్ 150' సినిమా తర్వాత కాజల్ రేంజ్ ఇంకా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఎంతలా పెరిగిపోయిందంటే, ఇప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ కాజల్ అనేంతలా అని సినీ వర్గాల్లో అందరూ చర్చించుకుంటున్నారు. ఈ బ్యూటీకి పెరిగిన డిమాండ్‌తోపాటే రెమ్యునరేషన్ కూడా పెంచేసిందట. అయితే ఈ రెమ్యునరేషన్ వార్తల్ని మాత్రం కాజల్ కొట్టి పారేస్తుంది. అడిగినంత రెమ్యునరేషన్ ఏ నిర్మాతా ఇవ్వరనీ, డిమాండ్ మేరకు ఏ హీరోయిన్‌కి ఎంత ఇవ్వాలో నిర్మాతలే నిర్ణయిస్తారని చెప్పింది కాజల్ అగర్వాల్. డిమాండ్ మేరకు రెమ్యునరేషన్ అంటే కాజల్ రెమ్యునరేషన్ పెరిగిపోయినట్టే కదా.