కాజల్‌కి పెళ్లి మీద మనసు మళ్లదా? ఓ వైపు ఆమె సోదరి నిషా అగర్వాల్ పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకి జన్మినిచ్చింది కూడా. కానీ, కాజల్ మాత్రం కెరీర్‌లో బిజీగా ఉంటూ, పెళ్లి ఊసే ఎత్తడం లేదు. దాంతో ఈ మధ్య అభిమానులే ఎలాగోలా చందమామకి మూడు ముళ్లు వేసేసే ప్రయత్నాలు మొదలెట్టేశారు. ఏదో ఒక రకంగా కాజల్ పెళ్లి వార్తను తెరపైకి తీసుకొస్తున్నారు. మొన్నా మధ్య త్వరలోనే కాజల్ పెళ్లి చేసుకోబోతోందట అనే గాలి వార్త పుట్టించారు. తూచ్..! అదంతా ఉత్తదే అని కాజల్ కొట్టి పారేసింది.
ఆ తర్వాత కూడా కాజల్ పలానా వ్యక్తితో ప్రేమలో ఉందట.. అనే ఇంకో గాలి వార్త పుట్టించారు. అది కూడా తప్పని తేలింది. ఇంతవరకూ ఎఫైర్లు లేని, పుట్టని హీరోయిన్ అంటే కాజల్ అగర్వాల్ అని నిస్సందేహంగా చెప్పేయొచ్చు. ఇప్పుడు కూడా కాజల్ పెళ్లిపై వస్తున్న రూమర్సే కానీ, అఫైర్స్ మాత్రం అంతగా అంటకట్టడం లేదు చందమామకి. ఎంతైనా చందమామ కదా. ఇకపోతే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాజల్ 'పెళ్లెప్పుడు.?' అనే ప్రశ్నకు నాకు నచ్చిన వ్యక్తి దొరికితే ఖచ్చితంగా చేసుకుంటా.. అని సమాధానమిచ్చిందట. అయితే, తనకు కాబోయే వ్యక్తికి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండాలని రూల్స్ పెట్టిందట.
అంత సులువుగా తన మనసును గెలుచుకోవడం సాధ్యం కాదని కూడా చందమామ తేల్చేసిందట. అబ్బో.. అలాగా.. అందుకేనేమో చందమామ విషయంలో ఇంతవరకూ ఎలాంటి అఫైర్స్ పుట్టలేదు.. అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే, చందమామ ప్రస్తుతం 'ఇండియన్ 2' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు, ఆమె నటించిన కొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని సినిమాలు సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి.