ఆచార్యలో హీరోయిన్ ఎవరు? అని సడన్ గా అడిగితే పూజా హెగ్డే పేరు చెబుతారు. కానీ.. కాజల్ ని మర్చిపోతారు. చిత్రబృందం కూడా కాజల్ ని మర్చిపోయిందేమో అనిపిస్తోంది. ఎందుకంటే... ఆచార్య టీజర్‌లో గానీ, ట్రైలర్ లో గానీ కాజల్ ప్రస్తావనే లేదు. చిరు సరసన ఈ చిత్రంలో కాజల్ ని కథానాయికగా ఎంచుకున్నారు. ఇప్పటి వరకూ చిరు, కాజల్ ల మధ్య ఒక్క డ్యూయెట్ పాట కూడా బయటకు రాలేదు. దాంతో కాజల్ పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సినిమాలోంచి కాజల్ పాత్రని పూర్తి గా లేపేశారని, `లేదు. లేదు.. బాగా కుదించారు` అని టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కాజల్ ఉన్న మాట వాస్తవం. ఆమె.. చిరు సరసన హీరోయిన్ గా నటించిన మాట వాస్తవం. కాకపోతే.. ఆ పాత్రని బాగా తగ్గించేశారు. ఫైనల్ కట్ లో కాజల్ పాత్రని నామమాత్రంగా చేసేశారని వినికిడి. కాజల్ కి ఆమధ్యే పెళ్లయ్యింది. పెళ్లి తరవాత.. ఈ సినిమా పూర్తి చేసింది. అయితే ఇప్పుడు తాను గర్భవతి. ప్రేక్షకులు కూడా కాజల్ ని ఆ దృష్టితోనే చూస్తారని, దాని వల్ల.. తెరపై కాజల్ కనిపిస్తే.. హీరోయిన్ అనే ఫీలింగ్ రాదన్నది దర్శక నిర్మాతల ఉద్దేశం కావొచ్చు. అందుకే ఇప్పటి వరకూ కాజల్ ని హైడ్ చేస్తూనే ఉంచారు. సినిమాలో కూడా ఆమె పాత్రకి కత్తెర వేశారా? అలానే ఉంచారా? అనేది తెలియాలంటే ఆచార్య వచ్చే వరకూ ఆగాలి.