మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'విజేత' చిత్రం అప్పట్లో ఘనవిజయం సాధించింది. పెద్దగా బాధ్యతలేమీ లేని ఓ సగటు మధ్య తరగతి కుర్రాడు, బాధ్యత తెలుసుకుని కుటుంబాన్ని సమస్యల నుంచి గట్టెక్కించేందుకు చేసే త్యాగం, ఆ త్యాగం అతన్ని విజేతగా నిలిపిన వైనం ఇదీ ఆ సినిమా కథ. అదే 'విజేత' టైటిల్‌తో మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ తెరంగేట్రం చేయబోతున్నాడు.
ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలయ్యింది. ఆనాటి 'విజేత'తో పెద్దగా పోలికలేమీ కన్పించడంలేదు. కానీ, ఓ మంచి తండ్రి.. ఓ సాధారణమైన కుర్రాడు.. ఇలా సాగింది టీజర్. తండ్రి పాత్రలో మురళీ శర్మ అద్భుతంగా కనిపిస్తున్నాడు. తొలి సినిమానే అయినా కళ్యాణ్‌దేవ్ ఆకట్టుకున్నాడు. టీజర్‌ని బీభత్సంగా చేసెయ్యలేదు. చాలా సింపుల్‌గా కట్ చేశారు.
సినిమా కథేంటో చెప్పలేదుగానీ, తండ్రీ కొడుకుల మధ్య భావోద్వేగాల నేపథ్యంలో కథ సాగుతుందన్న సంకేతాల్ని పంపారు. హీరోయిన్ మాళవిక నాయర్ క్యూట్‌గా కన్పిస్తోంది. తనదైన ఎక్స్‌ప్రెషన్స్‌తో మాళవిక ఆకట్టుకుంది. కన్పించింది కాస్సేపే అయినా టీజర్‌లో ఆమె పాత్ర బాగా ఎలివేట్ అయ్యింది. క్లాస్ లుక్‌తో డీసెంట్‌గా మూవీని చిత్రీకరించారనే విషయం టీజర్‌ని చూస్తే అర్థమవుతుంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావున్నాయి. రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాధారణంగా హీరోల తెరంగేట్రం సందర్భంగా బోల్డంత హైప్, అందుకు తగ్గట్టుగా బిల్డప్ కన్పిస్తుంది. అవేవీ లేకుండా టీజర్‌ని కూడా కూల్‌గా రూపొందించి విడుదల చేయడం గమనార్హం.