లాక్ డౌన్ తరవాత.. కొన్ని పరిమితులతో షూటింగులకు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. కానీ.. స్టార్ హీరోలెవరూ షూటింగులు చేసుకోవడానికి ఉత్సాహం చూపించడం లేదు. `కరోనా ప్రభావం బాగా తగ్గిన తరవాత షూటింగులు చేసుకుందాం` అనే ఆలోచిస్తున్నారు. కానీ.. కరోనా మాత్రం రోజు రోజుకీ విజృంభిస్తూనే ఉంది. అందుకే షూటింగులు పెద్దగా జరగడం లేదు.
ఈ నేపథ్యంలో.... మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ షూటింగులకు రెడీ అయ్యాడు. విజేతతో కల్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన రెండో సినిమా `సూపర్ మచ్చీ` ఇప్పుడు కొత్త షెడ్యూల్ మొదలెట్టింది. ఈరోజు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో, లాక్ డౌన్ నిబంధనల మేరకు షూటింగ్ మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు. అజయ్, రుచితారామ్, కల్యాణ్‌లపై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే నెలలో గోవాలో రెండు పాటల్ని తెరకెక్కిస్తారు. దాంతో చిత్రీకరణ పూర్తవుతుంది.