తెలుగులో పార్ట్ 1, పార్ట్ 2 సంస్కృతి పెరుగుతోంది. బాహుబలిని ఇలానే రెండు భాగాలుగా తీసి సూపర్ హిట్టు కొట్టాడు రాజమౌళి. ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఇలా రెండు భాగాలుగానే వచ్చింది. ఇప్పుడు పుష్షనీ రెండు భాగాలుగా విడుదల చేస్తున్నాడు సుకుమార్. కల్యాణ్ రామ్ కూడా ఇదే థియరీ ఫాలో కాబోతున్నట్టు టాక్.
కల్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త సినిమా `బింబిసార`. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ నిర్మిస్తున్నారు. వశిష్ట్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇటీవల ఎన్టీఆర్ జయంతి సందర్భంగా `బిబిసార` ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. కల్యాణ్ రామ్ గెటప్ చూస్తే, ఇదో పిరియాడికల్ మూవీ అనే సంగతి అర్థమవుతోంది. అయితే ఇప్పుడు ట్విస్ట్ ఏమిటంటే.. ఈసినిమాని ఏకంగా 3 భాగాలుగా విడుదల చేయాలనుకుంటున్నాడట కల్యాణ్ రామ్.
ఇప్పటికే తొలి భాగానికి సంబంధించిన 80 శాతం షూటింగ్ పూర్తయ్యిందని, ఒకొక్క భాగానికీ మధ్య మూడు నెలలు గ్యాప్ వచ్చేలా చూసుకుని సినిమాల్ని విడుదల చేయాలనుకుంటున్నాడు. అదే నిజమైతే.. తెలుగులో మూడు భాగాలుగా వస్తున్న సినిమా ఇదే. బింబిసారలో ఈ స్కెచ్ వర్కవుట్ అయితే.. భవిష్యత్తులో 3 భాగాల ట్రెండ్ మొదలైపోతుంది.