కళ్యాణ్‌రామ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. వీరభద్రపురం నియోజక వర్గం నుండి. ఆయన గుర్తు 'ట్యాప్'. వీరభద్రపురం ప్రజలు ట్యాప్ గుర్తుకే ఓటేయ్యాలంటూ కళ్యాణ్ రామ్ ప్రచారానికి దిగాడు. ఇంతకీ కళ్యాణ్‌రామ్ ఏంటి? ట్యాప్ గుర్తేంటి? అసలింతకీ ఎన్నికల ప్రచారం ఏంటి? అనుకుంటున్నారా? ఆగండాగండి. ఈ ఎన్నికల ప్రచారం రియల్ ఎలక్షన్స్ కోసమైతే కాదండోయ్. రీల్ ఎలక్షన్స్ కోసం. కళ్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. 'ఎమ్మెల్యే' టైటిల్‌తో తెరకెక్కుతోంది ఆ చిత్రం. రాజకీయాల నేపథ్యంలో సాగే చిత్రం అది. అందులో కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే పాత్రలో అభిమానుల్ని అలరించనున్నాడు. అందుకోసమే ఇదంతా. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాజల్ ఈ మధ్య ఎన్నికల నేపథ్యంలో తెరకెక్కిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయం దక్కించుకుంది. అలాగే తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కిన 'మెర్సల్' సినిమా కూడా హిట్ అయ్యింది. ఈ సినిమాకీ రాజకీయంతో టచ్ ఉంది. తెలుగులో ఈ సినిమా 'అదిరింది' టైటిల్‌తో ఈ నెల 9న విడుదల కానుంది. ఇదంతా ఎందుకంటే, ప్రస్తుతం సినీ పాలిటిక్స్ ఫార్ములా బాగా వర్కవుట్ అవుతున్నట్లే కనిపిస్తోంది. ఒకవేళ ఈ సినిమా కళ్యాణ్ రామ్‌కి కూడా కలిసొస్తుందేమో చూడాలి. ప్రస్తుతం 'ఎమ్మెల్యే' షూటింగ్ చివరి దశకు చేరుకుంది. డిశంబర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో ఉంది చిత్ర యూనిట్. అన్నట్లు మేకింగ్‌లో ఉన్న మహేష్ సినిమా 'భరత్ అను నేను' కూడా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమే. 'ఎమ్మెల్యే'లో కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే అయితే, ఇందులో మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు. అదీ సంగతి.