నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇటీవలే సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఓ సినిమాని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌కి జోడీగా మెహ్రీన్ నటిస్తోంది. ఇదో యాక్షన్ బేస్‌డ్ మూవీ అని సమాచారమ్. 'శతమానం భవతి' వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కించిన సతీష్ వేగేశ్న ఈ సారి తన కథకు కాస్త యాక్షన్ టచ్ ఇచ్చి, నందమూరి హీరోతో ప్రయోగం చేయబోతున్నాడీ సినిమాతో.
సరే, ఈ సినిమా సంగతి ఇలా ఉంటే, సందట్లో సడేమియా అంటూ, ఇంకో సినిమాకీ కళ్యాణ్‌రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ట చెప్పిన స్క్రిప్టు కళ్యాణ్‌రామ్‌కి నచ్చడంతో ఈ సినిమాని వెంటనే ఓకే చేశాడు. ఈ సినిమాకి 'తుగ్లక్' అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఒకటి వినిపిస్తోంది. ఈ సినిమాకి టైటిల్ 'తుగ్లక్' కాదు, 'రావణ' అంటున్నారట. 'తుగ్లక్' అనే టైటిల్‌లో నెగిటివిటీతో కూడిన ఫన్ ఉండడం నిర్మాతలకు కాస్త ఇబ్బందిని కలిగిస్తోందట.
దాంతో, నెగిటివ్ ఛాయలున్నా, టైటిల్‌లో పవర్‌ఫుల్ ఇంపాక్ట్ ఉండాలనే ఉద్దేశ్యంతో 'రావణ' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చూచాయగా టైటిల్‌ని బయటికి వదలడం, ఆడియన్స్ నుండి రెస్పాన్స్ పట్టడం, ఆ తర్వాత అదే టైటిల్‌ని సినిమాకి ఫిక్స్ చేయడం ఇప్పుడు నయా ట్రెండ్. అలా 'రావణ' టైటిల్‌ని ఫ్యాన్స్ యాక్‌సెప్ట్ చేస్తే, ఇక లాక్ చేయడమే తరువాయి కాబోలు.