అనుకోకుండా 'సైరా'కి కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. ఈ సినిమా విడుదలని ఆపడానికి ఓ వర్గం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. జులై 10న కోర్టు తీర్పు వెలువరించనుంది. నిజానికి 'సైరా' గొడవ వెనుక పెద్ద కథే ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సొంతూరులో 'సైరా' షూటింగ్ చేద్దామనుకున్నారు. చిత్రబృందం ఆ ఊరిని సంప్రదించింది కూడా. ఊర్లోవాళ్లంతా షూటింగ్ చేసుకోమని చెప్పారు.
అందుకు ప్రతిఫలంగా కొంత సొమ్ము ఇస్తానని చిత్రబృందం హామీ ఇచ్చింది. అంతేకాదు.. ఆ ఊర్లో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే... ఉయ్యాలవాడ ఊరిలో ఒక్క సన్నివేశం కూడా తెరకెక్కించలేదు. అందుకు సంబంధించిన సెట్ హైదరాబాద్ శివార్లలోనే వేసేశారు. షూటింగ్ అంతా అక్కడే జరిగింది. అందుకే... చిత్రబృందం ఆ ఊరి ప్రజలకు డబ్బులు చెల్లించలేదు. 'మీరు షూటింగ్ చేసినా, చేయకపోయినా ఇస్తామన్న డబ్బులు ఇవ్వాల్సిందే, లేదంటే షూటింగ్‌ని అడ్డుకుంటాం' అని కొంతమంది గ్రామస్థులు బెదిరింపులకు, బ్లాక్‌మెయిల్‌కీ దిగారు.
దాంతో.. చిత్రబృందం కోర్టుని ఆశ్రయించింది. ఈనెల 10 వరకూ `సైరా` టీమ్‌కి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని, గ్రామస్థులకు కోర్టు ఆదేశించింది. అయితే అందుకు విరుద్ధంగా రామ్‌చరణ్ ఆఫీసు ముందు ఆందోళన చేపట్టారు. ఈనెల 10న కోర్టు ఏం చెబుతుందా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. `సైరా` చిత్రబృందానికి అనుకూలంగానే తీర్పు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి