ప్రభాస్ - నాగ అశ్విన్ కాంబోలో రూపుదిద్దుకొంటున్న 'కల్కి' ఎన్నో ప్రత్యేకతలు సొంతం చేసుకొంది. మరీ ముఖ్యంగా కాస్టింగ్ పరంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకొంది. ఈ చిత్రంలో దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటిస్తున్నారు. ఇలాంటి లెజెండరీ నటుల్ని ఒకే ఫ్రేములో చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ రెండు పాత్రలకు పురాణాల్లోని పాత్రలు రిఫరెన్స్‌గా ఉంటాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అశ్వద్ధామ పాత్రకు అమితాబ్ క్యారెక్టర్ రిఫరెన్స్ అని టాక్ నడుస్తోంది. కమల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడని నిన్నా మొన్నటి వరకూ అంతా భావించారు. అయితే ఇప్పుడు కమల్.. కల్కిలో తనిది అతిథి పాత్ర మాత్రమే అని తేల్చేశాడు.
ఓ ఇంటర్వ్యూలో భాగంగా కమల్ తన చేతిలో ఉన్న ప్రాజెక్టుల చిట్టా విప్పాడు. కల్కి గురించి మాట్లాడుతూ, ఈ సినిమాలో తాను గెస్ట్ రోల్ లో కనిపిస్తానని, తనకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిందని వెల్లడించాడు. సో.. కమల్ మాటల్ని బట్టి, ఈ సినిమాలో కమల్ విలన్ కాదని తేలిపోయింది. అయితే... ప్రభాస్‌ని ఢీ కొట్టే ఆ ప్రతినాయకుడు ఎవరన్న విషయంలో ఇప్పుడు మరింత సస్పెన్స్ మొదలైపోయింది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌తో పాటు రాజమౌళి, రాంగోపాల్ వర్మ కూడా స్పెషల్ రోల్స్ లో దర్శనమివ్వనున్నారు.