రాజకీయాల్లో కమల్ హాసన్ కి వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. చివరికి కమల్ హాసన్ సైతం ఓడిపోయారు. స్వయంగా పార్టీ అధ్యక్షుడే ఓటమి పాలైతే.. ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవొచ్చు. ఇప్పుడు కమల్ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. తన పార్టీలోని కీలక నేతలంతా రాజీనామాలు చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే కమల్ తప్ప ఆ పార్టీలో ఇంకెవరూ ఉండరేమో అనిపిస్తోంది. వరుస రాజీనామాలపై కమల్ స్పందించాడు.
పార్టీని వీడుతున్నవాళ్లందరినీ ద్రోహులుగా పరిగణిస్తూ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎవరూ లేకపోయినా, పార్టీ నడుస్తుందని, పార్టీ తన లక్ష్యాల వైపు దూసుకెళ్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. వాళ్లు రాజీనామా చేయకపోయినా.. నేనే వాళ్లని పార్టీ నుంచి బహిష్కరించాలనుకున్నా - అంటూ ఘాటుగా విమర్శించారు. కమల్ పార్టీలో నియంతృత్వ ధోరణి ఉందని, ఎవరి మాటకూ అక్కడ విలువ లేదని ఆ పార్టీని వీడిపోతున్నవాళ్లంతా చెబుతున్నారు. పరిస్థితి ఇలా కొనసాగితే వచ్చే ఎన్నికల సమయానికి కమల్ పార్టీ ఉండడం అనుమానమే.