'థ్యాంక్యూ బ్ర‌ద‌ర్‌' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు : అనసూయ, విరాజ్ అశ్విన్ తదితరులు 
దర్శకత్వం : రమేష్ రాపర్తి 
నిర్మాత‌లు : శరత్ చంద్ర రెడ్డి, తారక్ నాధ్ 
సంగీతం : గుణ బాలసుబ్రమణ్యం
సినిమాటోగ్రఫర్ : సురేష్


రేటింగ్: 2.5/5


మ‌నిషికి మ‌నిషే ఆస‌రా. డ‌బ్బు, హోదా, అహం... ఇవేమీ కొన్నిసార్లు అక్క‌ర‌రావు. అప్పుడు మ‌నిషే భ‌రోసా ఇవ్వాలి. ఇవ్వ‌గ‌ల‌డు కూడా.  దేవుడు కూడా రాలేని చోటు.. సాటి మ‌నిషే దేవుడిలా మారి సాయం చేయ‌గ‌ల‌డు. అదే మాన‌వ‌త్వం. అప్పుడే మ‌నిషిత‌త్వం పుడుతుంది. ఈ విష‌యాన్ని చ‌ర్చించిన సినిమా `థ్యాంక్యూ బ్ర‌ద‌ర్‌`. `ఎలివేట‌ర్ బేబీ`లోని ఓ పాయింట్ ని తీసుకుని తీర్చిదిద్దారు. ఆహా ద్వారా ఈరోజే విడుద‌లైంది. మ‌రి.. థ్యాంక్యూ బ్ర‌ద‌ర్ ఎలా వుంది?  ఎమోష‌న్స్ ని ఎంత మేర త‌ట్టి లేపింది?


* కథ‌


అభి (విరాజ్ అశ్విన్‌)కి పొగ‌రు, అహంకారం. తాగి తంతనాలు ఆడ‌డం త‌ప్ప మ‌రో ప‌ని ఉండ‌దు. అమ్మంటే లెక్క లేదు. ఇంట్లో గొడ‌వ‌ప‌డి స్నేహితుల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస్తాడు. అక్క‌డా అవ‌మాన‌మే ఎదుర‌వుతుంది. డ‌బ్బుంటే త‌ప్ప త‌న‌ని ఎవ‌రూ లెక్క చేయ‌ర‌న్న విష‌యం అర్థం అవుతుంది. దాంతో ఉద్యోగాల కోసం ప్ర‌య‌త్నిస్తుంటాడు. మ‌రోవైపు ప్రియ (అన‌సూయ‌) క‌థ. త‌ను ఓ నిండు గ‌ర్భిణి.

 

ఓ ప్ర‌మాదంలో భ‌ర్త‌ని కోల్పోతుంది. త‌న భ‌ర్త ప‌నిచేసే ఆఫీసు నుంచి వ‌చ్చే డ‌బ్బుల కోసం ఎదురు చూస్తుంటుంది. ఓసారి అభి, ప్రియా ఇద్దరూ ఓ అపార్ట్ మెంట్ లిఫ్టులో ఇరుక్కుపోతారు. ప్రియ‌ని నొప్పులు ఎక్కువ‌వుతాయి. అప్పుడు అభి ఏం చేశాడు?  ప్రియ‌ని, త‌న క‌డుపులోని బిడ్డ‌ని ఎంత రిస్క్ తీసుకుని కాపాడాడు?  అనేదే మిగిలిన క‌థ‌.


* విశ్లేష‌ణ‌


థ్యాంక్యూ బ్ర‌ద‌ర్ ట్రైల‌ర్ చూస్తే.. ఈసినిమా క‌థంతా అర్థ‌మైపోతుంది. అయినా కొన్ని సినిమాల‌కు క‌థ‌లు అవ‌స‌రం లేదు. ఎమోష‌న్స్ ఉంటే చాలు. ఈసినిమాలో అలాంటి ఎమోష‌న‌ల్ పాయింట్ ఉంది. మ‌నుషులంటే లెక్క‌లేని ఓ కుర్రాడికి... జీవితం విలువ‌, త‌న త‌ల్లి విలువ ఎలా తెలిసింద‌న్న‌దే పాయింట్. త‌న చేతిలతో ఓ బిడ్డ‌కు ప్రాణం పోసిన‌ప్పుడే.. త‌న త‌ల్లి పురిటి నొప్పుల బాధేంటో అర్థం అవుతుంది. ఆడ‌వాళ్ల‌పై గౌర‌వం పెరుగుతుంది. నిజానికి చాలా వాలీడ్ పాయింట్ ఇది. కానీ.. దాన్ని ప్ర‌జెంట్ చేసే విధానం.. బోర్ కొట్టిస్తుంది. తొలి స‌గం.. అభి, ప్రియ‌ల నేప‌థ్యానికే వాడుకున్నాడు. ఆ స‌న్నివేశాలు బోర్ క‌ట్టిస్తాయి.


ద్వితీయార్థం అంతా లిఫ్టు లోనే. ఒకే లొకేష‌న్ లో తీసిన స‌న్నివేశాలు కాబ‌ట్టి.. అవి కూడా బోరింగ్ గానే ఉంటాయి. పైగా క్లైమాక్స్ ఏంట‌న్న‌ది తెలిసిపోతుంది కాబ‌ట్టి ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ప్రియ‌, అభిల నేప‌థ్యాన్ని ఇంపాక్ట్ తో రాసుకోవాల్సింది. ఎమోష‌న్స్ ని పండించే సీన్లు ఇంకొన్ని ప‌డాలి. క్లైమాక్స్‌లో క‌నిపించే మూడ్‌.. సినిమాలో ఒక‌ట్రెండు చోట్ల‌యినా ఎలివేట్ అయితే బాగుండేది. క‌థానాయకుడిలో వ‌చ్చే మార్పు.. స‌డ‌న్ గా వ‌చ్చిన‌ట్టు ఉంటుంది. పైగా ఈ త‌ర‌హా సీన్ `గమ్యం`లాంటి సినిమాల్లో చూసిందే.

 

అభి క్యారెక్ట‌ర్‌ని ఎలివేట్ చేసేందుకు కొన్ని హాట్ సీన్లు వాడుకున్నారు. అందులో ముద్దు సీన్లు ఇంగ్లీషు సినిమాల్ని మించిపోయేలా ఉంటాయి. సినిమా కోసం తీసి ఓటీటీ లో విడుద‌ల చేయాల్సి వ‌చ్చింది. కానీ ర‌న్ టైమ్ చూస్తే గంట‌న్న‌రే. ఓటీటీ కోసం ఈ సినిమాని మ‌రింత ట్రిమ్ చేశారా?  అంతే తీశారా? అనే అనుమానం క‌లుగుతుంది. గంట‌న్న‌ర సినిమానే బోర్ కొడితే.. సినిమా అంతా చూపిస్తే ఇంకెలా ఉంటుందో?


* న‌టీన‌టులు


విరాజ్ ఓకే అనిపిస్తాడు. తొలి స‌న్నివేశాల్లో కంటే, ప‌తాక స‌న్నివేశంలోనే త‌న న‌ట‌న బాగుంది. అన‌సూయ మ‌రోసారి డిఫరెంట్ పాత్ర పోషించింది. తన ఇమేజ్ కి గ‌ర్భ‌ణీ పాత్ర పోషించ‌డం రిస్కే. కానీ మ‌రొక‌రైతే.... ఆ పాత్ర‌కు అంత ఎలివేష‌న్ వ‌చ్చేది కాదేమో. హ‌ర్ష‌.. ఒక‌ట్రెండు చోట్ల న‌వ్విస్తాడు. అన్నపూర్ణ‌మ్మ ని చాలా రోజుల త‌ర‌వాత చూసే అవ‌కాశం ద‌క్కింది. మిగిలిన‌వాళ్ల‌వి చిన్న చిన్న పాత్రలే.


* సాంకేతిక వ‌ర్గం


త‌క్కువ బ‌డ్జెట్ లో తీసిన సినిమా ఇది. ఈ సినిమాకి భారీ బ‌డ్జెట్లు కూడా అవ‌స‌రం లేద‌నుకోండి. కానీ కొన్ని చోట్ల క్వాలిటీ ప‌రంగా రాజీ ప‌డిన‌ట్టు క‌నిపిస్తుంది. ఓటీటీకి ఇచ్చేశారు కాబ‌ట్టి గిట్టుబాటు అవుతుంది. నిర్మాత సేఫ్ జోన్ లో ప‌డిన‌ట్టే. ఒకే ఒక్క పాట ఉంది. అది కూడా బ్యాక్ గ్రౌండ్ సాంగ్. నేప‌థ్య సంగీతం, కెమెరా వ‌ర్క్‌.. జ‌స్ట్ ఓకే అనిపిస్తాయి. సంభాష‌ణ‌లు ఇంకా బ‌లంగా రాసుకోవాల్సింది.


* ప్ల‌స్ పాయింట్స్


ఎలివేట‌ర్ బేబీలోని పాయింట్
ప‌తాక స‌న్నివేశాలు


* మైన‌స్ పాయింట్స్‌


బోరింగ్ క‌థ‌నం


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్:  జ‌స్ట్ ఓకే బ్ర‌ద‌ర్‌


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS