రాజకీయాలు అంత ఈజీ కాదు. ఇక్కడి వ్యూహాలు వేరు. లెక్కలు వేరు. సినిమా స్టార్లు, సినిమాల్ని శాశించిన వాళ్లు, సినిమాల్లో.. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన వాళ్లు రాజకీయాల్లో బొక్క బోర్లా పడడానికి కారణం అదే. ఆ లెక్కలు తెలీకే. పవన్ కల్యాణ్ `జనసేన` సంగతేంటో.. అందరికీ తెలిసిందే. ఆయనే స్వయంగా రెండు చోట్ల ఓడిపోయారు. గెలిచిన ఒక్క సీటూ.. ఉన్నా లేనట్టే. అంటే.. లెక్క ప్రకారం ఆంధ్రా రాజకీయాల్లో పవన్ జీరో.
ఇప్పుడు కమల్ హాసన్ పరిస్థితీ అంతే. తమిళనాడుకు కొత్త రాజకీయం చూపిస్తానని బరిలోకి దిగారాయన. మక్కల్ నీది మయ్యమ్ పార్టీ స్థాపించి.... 142 స్థానాల్లో అభ్యర్థుల్ని బరిలో దింపారు. అయితే... తనతో పాటు అందరూ మూకుమ్మడిగా ఓడిపోయారు. దాదాపు అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు గల్లంతయ్యాయి. స్వయంగా అధ్యక్షుడు ఓడిపోవడంతో ఇక్కడ `జనసేన` సీన్ రిపీట్ అయినట్టైంది. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్... బీజేపీ అభ్యక్థి వనతి శ్రీనివాసస్ చేతిలో 1300 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నిజానికి కమల్ కి ఎన్నికల్లో గెలిచేంత సీన్ లేదని, ఆ పార్టీ ఒక్క చోట కూడా గెలవదని.. ముందు నుంచీ తమిళ రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. అయితే కనీసం కమల్ అయినా గెలుస్తాడని అభిమానులు భావించారు.
తొలి రౌండ్లలో కమల్ అధిక్యం కనబరిచారు. అయితే చివరికి వచ్చేసరికి... ఓట్లాటలో వెనుకబడ్డారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకూ... ఈపార్టీని కొనసాగించడం కష్టమే అన్నది అక్కడి రాజకీయ విశ్లేషకుల మాట. నడిపించడానికి కార్యకర్తలేరి? ఎం.ఎల్.ఏలు ఏరి? `నేను పవన్ లా కాదు.. ఏ పార్టీకీ తలొగ్గను` అంటూ ఎన్నికల ప్రచార పర్వంలో ఊదరగొట్టాడు. అలాంటిది పవన్ కంటే ఘోరంగా ఓడిపోయాడు. కమల్ కి... రాజకీయం అంత సులభంగా అర్థమయ్యే ఆట కాదని ఇప్పటికైనా అర్థమయ్యే ఉంటుంది.