కమల్ హాసన్ రాజకీయ ప్రయాణంపై.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నీళ్లు చల్లాయి. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడు కమల్. తానే స్వయంగా ఓడిపోయాడు. పైపెచ్చు... పార్టీలోకి కీలక నేతలంతా తట్టా బుట్టా సర్దుకుని బయటకు వెళ్లిపోయారు. దాంతో.. కమల్ ఒంటరిగా మిగిలాడు. రాజకీయాల్లో ఇప్పుడు తాను చేసేదేం లేదు. అందుకే సినిమాలపై ఫోకస్ మళ్లించాడు. తన చేతిలో ఉన్న `భారతీయుడు 2`ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నది కమల్ ప్లాన్. అయితే ఆ సినిమా నిర్మాత, దర్శకుడి మధ్య విబేధాలతో ఆగిపోయింది. ఇప్పుడు ఈ వివాదాన్ని పరిష్కరించాలని పూనుకున్నాడట కమల్. వీలైనంత త్వరలో.. శంకర్, లైకా ప్రొడక్షన్స్ తో సంధి కుదర్చాలని భావిస్తున్నాడు.
ఈ వివాదం విషయమై శంకర్ మధ్యవర్తిత్వం వహిస్తాడని తమిళనాట జోరుగానే ప్రచారం సాగింది. అయితే కమల్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల అది కుదర్లేదు. ఇప్పుడు రాజకీయం అంతా అయిపోయింది. కమల్ ఖాళీనే. తన సినిమా విషయంలో వచ్చిన అడ్డంకిని తానే తొలగించాలని భావిస్తున్నాడు. కమల్ పెద్ద మనిషి స్థానంలో కుర్చిని రాజీ కుదిరిస్తే.. తమకెలాంటి అభ్యంతరం లేదని శంకర్, లైకా నిర్మాతలు తేల్చి చెప్పేశారు. కాబట్టి... త్వరలోనే భారతీయుడు 2 వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశం వుంది.