ఫ్యాన్స్‌కి షాకిచ్చిన కమల్‌హాసన్‌ నిర్ణయం..!

మరిన్ని వార్తలు

నటనలో కమల్‌హాసన్‌కి సాటి ఎవరు.? అనే ప్రశ్నకు సమాధానమే లేదనడం అతిశయోక్తి కాదు. ఆయన నటించిన 'స్వాతిముత్యం' తదితర కొన్ని సినిమాలు అద్భుత కావ్యాలుగా సినీ చరిత్రలో మిగిలిపోతాయి. అందుకే ఆయన్ని విశ్వనటుడుగా అభివర్ణిస్తారు. అలాంటి కమల్‌ ఈ మధ్య సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ, రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆయన రాజకీయ ఎంట్రీ షురూ అయినాక విడుదలైన సినిమా 'విశ్వరూపం 2'. సక్సెస్‌ పరంగా ఎన్ని మార్కులు నమోదు చేసింది అనే లెక్క పక్కన పెడితే, కమల్‌ నుండి సినిమా వస్తుందంటే అభిమానుల్లో పెల్లుబికే ఆనందం లెక్కే వేరు.

తాజాగా కమల్‌హాసన్‌ 'ఇండియన్‌ 2' చిత్రంలో నటిస్తున్నారు. 22 ఏళ్ల క్రిందట వచ్చిన 'ఇండియన్‌' (తెలుగులో 'భారతీయుడు) చిత్రం ఎన్నెన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవినీతి, లంచగొండితనం అనే అంశాల్ని హైలైట్‌ చేస్తూ చెప్పిన ఈ కథ అన్ని వర్గాల వారినీ ప్రభావితం చేసింది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని గడగడలాడించింది. అలాంటి ఈ సినిమాకి ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్‌ రాబోతోందంటే అందరిలోనూ ఆశక్తి నెలకొంది. ఇక ఈ సినిమా కథా, కథనాలు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని విశేషంగా ప్రభావితం చేయనున్నాయని కమల్‌ తన మాటల్లో చెప్పకనే చెప్పేశారు.

మరో షాకింగ్‌ న్యూస్‌ ఏంటంటే ఈ సినిమా తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెప్పేస్తానని కమల్‌ పేర్కొన్నారు. దాంతో ఈ సినిమాని ఆయన ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాని శంకర్‌ తెరకెక్కిస్తున్నారు. చందమామ కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS