ఈరోజుల్లో డిజిటల్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. సినిమా ఫలితం అటూ ఇటూ అయినా.. శాటిలైట్, ఓటీటీల రైట్స్ తో నిర్మాత ఎంతో కంత సేఫ్ అవుతున్నాడు. స్టార్ హీరోల సినిమా అయితే... వీటికి మరింత డిమాండ్. ఒక్కోసారి అనూహ్యమైన రేట్లతో ఆశ్చర్యపరుస్తున్నాయి. కమల్ హాసన్ సినిమా - విక్రమ్ కి ఇదే జరిగింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. కమల్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మించాడు. ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించారు. దాంతో ఈ సినిమాపై హైప్ విపరీతంగా పెరిగింది. దాంతో శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో ఏకంగా రూ.125 కోట్లు పలికాయి. కమల్ సినిమాల్లో ఇదే రికార్డు.
కమల్ కి ఈమధ్య హిట్లేం లేవు. కమర్షియల్ గా ప్రతీ సినిమా బోర్లా పడుతోంది. అయినా సరే, ఈ సినిమాకి ఈ స్థాయిలో రేటు పలకడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కమల్, విజయ్ సేతుపతి, ఫాజిల్.. ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్ ఇది. అంతేనా.. ఖైదీ, మాస్టర్‌లతో లోకేష్ కనగరాజ్ తనదైన ముద్ర వేశాడు. అందుకే డిజిటల్ రేట్లకు రెక్కలొచ్చాయి. కమల్ పారితోషికం పక్కన పెడితే.. రూ.100 కోట్లలోనే ఈ సినిమా పూర్తయినట్టు సమాచారం. అంటే... సినిమా విడుదలకు ముందే పాతిక కోట్ల లాభం పట్టుకెళ్లిపోయింది. ఇక థియేటరికల్ రైట్స్... కూడా అమ్ముడైతే ఈ సినిమాకి భారీ లాభాలు దక్కినట్టే.