విశ్వనటుడు కమల్‌హాసన్ త్వరలో 'విశ్వరూపం 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలయ్యే ఈ సినిమా ప్రమోషన్స్‌ని తెలుగులో నిర్వహించేందుకు కమల్‌హాసన్ హైద్రాబాద్ విచ్చేశారు. ఇదే సందర్భంగా తెలుగు బుల్లితెర రియాల్టీ షో 'బిగ్‌బాస్' సెట్‌లో కమల్‌హాసన్ సందడి చేశారు.
తమిళ బిగ్‌బాస్‌కి కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు బిగ్‌బాస్ సెట్‌లోకి కమల్ అడుగుపెట్టడం ఒకింత విశేషమైన అంశమే అయినప్పటికీ, సినిమా ప్రమోషన్ నిమిత్తం వచ్చారు కాబట్టి, అదేమంత విశేషం కాదనే చెప్పాలి. అయితే కమల్‌ని బిగ్‌బాస్ హౌస్‌లో చూసిన హౌస్ మేట్స్ చాలా ఎగ్జైట్‌మెంట్ ఫీలయ్యారు. వారితో కాసేపు కమల్‌హాసన్ సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్ హౌస్‌మేట్స్‌లో ఒకరికి గోల్డెన్ ఆఫర్ ఇచ్చాడు.
అదేంటంటే 'ఎక్స్‌టెన్షన్ కార్డ్'. ఎవరైనా అనూహ్య పరిస్థితుల్లో హౌస్ నుండి ఎలిమినేట్ కావల్సి వచ్చినప్పుడు ఆ ఎక్స్‌టెన్షన్ కార్డ్ ద్వారా మరో రెండు వారాలు హౌస్‌లో కొనసాగవచ్చునన్న మాట. ఆ కార్డ్‌ని ఎందుకిస్తున్నానో అని కమల్ చెప్పిన రీజన్ అందర్నీ ఆకట్టుకుంది. తెలుగు, తమిళం, గుజరాతీ, మరాఠీ, కన్నడ భాష ఏదైనా ఇండియాలో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ మనమంతా ఒక్కటే. నార్త్ ఇండియా నుండి వచ్చి తెలుగు నేర్చుకుని, తెలుగులో సినిమాలు చేస్తున్న అమిత్‌కి ఆ ఎక్స్‌టెన్షన్ కార్డు ఇచ్చారు కమల్.
అంతగా పాపులర్ లేని, ఎవ్వరికీ తెలియని ఓ వ్యక్తికి ఈ కార్డ్ ఇస్తే సద్వినియోగమవుతుందని ముందుగా కమల్ చెప్పిన మాటలకు ఆ కార్డ్ సామాన్యుడు గణేష్‌కి దక్కుతుందేమో అని భావించారు. కానీ భాషా బేధం లేకుండా మనమంతా ఒక్కటే అని చాటిచెప్పేందుకు ఈ కార్డ్ అమిత్ తివారీకిస్తున్నాను అన్న కమల్ రీజన్ కన్విన్సింగ్‌గా అనిపించింది.