విశ్వనటుడు కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'విశ్వరూపం 2'. ఈ చిత్రం ఆగష్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ మధ్య రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న కమల్‌హాసన్, 'విశ్వరూపం 2' విడుదల సందర్భంగా తన మనసులోని మాటల్ని బయట పెట్టారు.
అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది. రాజకీయాల్లోకి వెళ్లాక కమల్ ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పేసినట్లే అనే వార్తలు వెలువడ్డాయి. కానీ ఆ వార్తల్లో ఎంత మాత్రమూ నిజం లేదు. ఈ సినిమా తనకు ఆఖరి సినిమా అని తానెప్పుడూ చెప్పలేదే.! అని కమల్ హాసన్ అంటున్నారు. రాజకీయాలు, సినిమాలు మ్యానేజ్ చేయడం కష్టం కదా.. అంటే, రాజకీయం వేరు, సినిమా వేరు. అయినా సినిమా నా వృత్తి. వృత్తిని ఎలా వదులుకుంటాను అని తిరుగు ప్రశ్న వేస్తున్నారు.
అయితే తన పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం అప్పుడు ఆయన సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చేస్తారట. అంతేకాదు, సీనియర్ నటుడు కమ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎంజీఆర్ కూడా రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లో కూడా నటించారు. ఆయనే నాకు ఆదర్శం అంటున్నారు కమల్ హాసన్. కమల్ మాటల ప్రకారం ఇంకా కమల్ హాసన్ నుండి సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనని తెలుస్తోంది.
ఇకపోతే 'విశ్వరూపం 2' విషయానికి వస్తే, ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఆండ్రియా, పూజా కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రతీ ఒక్క భారతీయుడు ఖచ్చితంగా చూడదగ్గ చిత్రం 'విశ్వరూపం 2' అని కమల్ చెబుతున్నారు. గతంలో వచ్చిన 'విశ్వరూపం' సినిమాకి ఇది ప్రీక్వెల్ మరియు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.