గత కొద్ది రోజులుగా అటు రాజకీయ కార్యక్రమాలకూ, ఇటు బిగ్ బాస్ షోకూ సినిమాలకూ దూరంగా ఉన్నారు కమల్ హాసన్. దాంతో కమల్ కి ఏమైంది? అంటూ ఆరాలు ఎక్కువైపోయాయి. కమల్ కి సర్జరీ జరిగిందని ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని వార్తలు కూడా వచ్చాయి. వీటిపై... ఇప్పుడు కమల్ కుటుంబం స్పందించింది. కమల్ కి శస్త్ర చికిత్స జరిగిన మాట నిజమే అని చెప్పారు.
ఈ మేరకు శ్రుతిహాసన్, అక్షర హాసన్‌లు ఓ స్టేట్‌మెంట్ విడుదల చేశారు. తమ తండ్రి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసిందని, మరో నాలుగైదు రోజులలో తిరిగి ఇంటికి వస్తారని క్లారిటీ ఇచ్చారు. `అతి త్వరలోనే నాన్నగారు మిమ్మల్ని కలుస్తారు. మీరు చూపించే ప్రేమ, అందించే ధైర్యం వలన నాన్న త్వరగా కోలుకుంటున్నారు`` అన్నారు కమల్ తనయిలు. ఈ యేడాది జరగబోతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో.. కమల్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు.